నాగాలాండ్ గవర్నర్ గణేశన్ మృతి పట్ల ప్రధాని సంతాపం
నాగాలాండ్ గవర్నర్, బీజేపీ మాజీ ఎంపీ ఎల్. గణేశన్ (80) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. దేశానికి సేవలందించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన జాతీయవాదిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ పార్టీ బలోపేతానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. ఈ నెల 8న చెన్నైలోని తన నివాసంలో కుప్పకూలడంతో గణేశన్ తలకు గాయమై ఆసుపత్రిలో చర్చారు. . వైద్యులు అప్పటి నుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందించారు. గణేశన్ భౌతికకాయాన్ని రాజకీయ నాయకులు, బంధువుల సందర్శనార్థం శనివారం ఉదయం ఆయన నివాసంలో ఉంచి, అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. తంజావూరులో 1945 ఫిబ్రవరి 16న జన్మించిన గణేశన్ చిన్న వయసులోనే RSS భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన తండ్రి, సోదరులకు కూడా RSSతో సంబంధాలు ఉండటంతో 1970లో గణేశన్ పూర్తి స్థాయి ప్రచారక్‌గా మారారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు మధురై తదితర ప్రాంతాల్లో సంఘ్‌లో సేవలందించి, 1991లో బీజేపీలో చేరి తమిళనాడు పార్టీ శాఖ సంస్థాగత కార్యదర్శిగా సేవలందించారు. తమిళనాట బీజేపీ బలోపేతానికి కృషి చేసిన ఆయన ఆ తర్వాత జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పని చేశారు. 2006 నుంచి 2009 మధ్య కాలంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2021 ఆగస్టులో మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2023లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ గానూ అదనపు బాధ్యతలు నిర్వహించారు.

