InternationalNewsNews Alert

 ఫ్లైట్‌లో పైలెట్ల లొల్లి.. పరస్పర దాడి

విమానాన్ని కంట్రోల్ చేయడం అంతా ఆషామాషీ కాదు. దాన్ని నడిపే పైలెట్లకు దానిపై ఎంతో అవగాహన , నైపుణ్యం ఉండాలి. ఎన్నో జగ్రత్తలు , చెకింగ్‌లు జరిగి అన్ని సవ్యంగా ఉన్నాయి అంటేనే దాన్ని టేక్‌ఆఫ్ చెస్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా , పైలెట్లు చాలా శ్రద్ధగా రన్‌వే నుండి ల్యాండింగ్ వరకు ప్రతి విషయాన్ని తమ నియంత్రణలో ఉంచుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా విమానంలో ఉన్న వారందరి ప్రాణాలకే ముప్పు తప్పదు. కానీ.. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన అటు అధికారులను , విమానంలో ఉన్న ప్రయాణికులకు తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. విమానం గాల్లోకి ఎగిరిన కొంత సమయానికి పైలెట్ల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వాన అయినట్టు చొక్కాలు పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్లింది. జూన్‌లో చోటుచేసుకున్న ఈ వివాదం తాజాగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏమి జరిగిందో తెలుసుకుందాం.

ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ పైలెట్లు ఇద్దరు గాల్లో ఎగిరే విమానంలో కొట్లాటకి దిగారు. ఎయిర్ ఫ్రాన్స్ విమానం జూన్‌ నెలలో జెనివా నుండి ప్యారిస్‌కు బయలుదేరింది. అన్ని చెకింగ్‌లు పూర్తి చేసుకొని గాల్లోకి ఎగిరింది. అప్పటి వరకు అంతా ప్రశాంతంగానే ఉన్నా , ఉన్నట్టుండి కాక్‌పిట్‌లో ఉన్న పైలెట్‌కు , కో పైలెట్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. అది అక్కడితో ఆగక ఒకరినొకరు తిట్టుకునే వరకు వెళ్లింది. దీంతో గొడవ తీవ్రంగా మారి ఒకరి కాలర్ ఒకరు పట్టుకొని పిచ్చపిచ్చగా కొట్టుకున్నారు. అసలు అంతమంది ప్రయణికుల ప్రాణాలను గాలికొదిలేసి , ఇలా కొట్టుకోవడం ఏంటి? కొంచం అయిన బుద్ధి ఉండాలి కదా. ఇంత గొడవ జరిగినా ఫ్లైట్‌ను సాధారణంగానే ల్యాండ్ చేశారు పైలెట్లు. దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆ ఇద్దరు పైలెట్లను యాజమాన్యం డిస్మిస్ చేసింది.