దసరా ఉత్సవాల్లో దాడులకు పీఎఫ్‌ఐ భారీ కుట్ర
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకలాపాలపై తీగ లాగితే డొంక కదులుతోంది. వచ్చే నెలలో జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా భారీ దాడులకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అందించిన సమాచారం ప్రకారం.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అగ్ర నేతలే లక్ష్యంగా పీఎఫ్‌ఐ స్కెచ్ గీసింది. వారి కదలికలపైనా, నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంపైనా రెక్కీ నిర్వహించింది. దసరా సందర్భంగా నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేతల కదలికలపై నిఘా కోసం పీఎఫ్‌ఐ ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసింది.

పీఎఫ్‌ఐపై నిషేధం విధించాలి..
ఇటీవల అరెస్టు చేసిన పీఎఫ్‌ఐ నాయకులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పీఎఫ్‌ఐపై నిషేధం విధించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పీఎఫ్‌ఐ దేశవ్యాప్తంగా విస్తరించిందని.. ఏదో ఒక్క రాష్ట్రం నిషేధం విధిస్తే సరిపోదని పేర్కొన్నది. పీఎఫ్‌ఐ కీలక నేత మినారుల్ షేక్.. అస్సాం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇతనికి అల్‌ఖైదా మద్దతున్న ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నామని అస్సాం పోలీసులు చెప్పారు. 2019లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అతడు కీలకపాత్ర పోషించాడు.

