తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం కోరలు విప్పుతోంది. ముఖ్యంగా మన దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థికవ్యవస్థ పాతాళానికి పడిపోతోంది. ఆ దేశంలో ప్రభుత్వం ప్రజలకు కనీస అవసరాలు కూడా అందించలేకపోతోంది. అక్కడి సెంట్రల్ బ్యాంకులో విదేశీ మారకనిల్వలు గత ఎనిమిదేళ్ల కనిష్ఠస్థాయికి చేరుకున్నాయి. గత సంవత్సరం జనవరిలో విదేశీమారక నిల్వలు దాదాపు 16 బిలియన్ డాలర్లు ఉంటే సంవత్సరం చివరికొచ్చేసరికి కేవలం 6 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. ఈ నిల్వలు కేవలం మూడువారాలకు మాత్రమే సరిపోతాయని అక్కడి మీడియా తెలియజేస్తోంది.

ప్రభుత్వం ఇతరదేశాలు, అంతర్జాతీయ సంస్థల నుండి సహాయం ఆశిస్తోంది. కానీ ఇప్పటికే అప్పులు తీర్చలేక చతికిలపడింది. ఓపక్క రుణాల కోసం పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే విదేశీ బ్యాంకులు రుణం తీర్చకపోవడం వల్ల అపరాధ రుసుమును వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి విలువ 228 రూపాయలుగా ఉంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సబ్సిడీ పథకాలలో కోత విధిస్తోంది. జీతాలు తగ్గించడం, విద్యుత్ బిల్లుల పెంపు వంటి చర్యలకు దిగింది. ఎన్ని చర్యలు తీసుకున్నా రుణాలు చెల్లించలేకపోతోంది. ఓపక్క ఉగ్రవాదం, మరోపక్క ఆర్థిక పతనావస్థతో సతమతమవుతోంది. ఇతర దేశాలు, ప్రపంచ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది పాకిస్తాన్.

