పాక్‌లో గోధుమ పిండికి కూడా కటకట
పొరుగు దేశం పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. అక్కడి ప్రజలు తిండికి కూడా వెంపర్లాడాల్సిన దుస్థితి వచ్చింది. డాలర్‌తో పాక్ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. గత ఏడాది ఏర్పడిన వరదల కారణంగా పంటలు నష్టపోవడంతో వ్యవసాయ రంగం బాగా నష్టపోయింది. అది ఆహారధాన్యాల కొరతకు దారితీసింది. ముఖ్యంగా ప్రజల ప్రధాన ఆహారమైన గోధుమలకు బాగా కొరత ఏర్పడింది. కిలో గోధుమ పిండి 160 రూపాయలకు పెరిగిపోయింది.

పోనీ రేషన్ దుకాణాలలో ఇస్తున్నారా? అంటే ప్రజలు రేషన్ గోధుమ పిండి కోసం గంటల తరబడి దుకాణాల ముందు వేచి చూడాల్సి వస్తోంది. అది కూడా విపరీతమైన తొక్కిసలాటలు జరిగినట్లు సమాచారం. చివరకు పోలీసులు, భద్రతాదళాల నేతృత్వంలో ఆహారధాన్యాలు పంపిణీ చేయవలసి వస్తోంది. తోపులాటలు, తొక్కిసలాటల వల్ల కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆదేశ ఆర్థిక మంత్రి తక్షణమే నాలుగు లక్షల గోధుమ పిండి బస్తాలు కావాలంటూ ప్రకటించాడు. దీనిని బట్టి అక్కడి ఘోరమైన పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ తమ దేశ దుస్థితికి పూర్వ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ ఆరోపిస్తున్నాడు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ నివేదిక ఇక ఆహారనిల్వలు కేవలం మూడు వారాలకు మాత్రమే సరిపోతాయని వెల్లడిస్తోంది.

