కాలం చెల్లిన కమ్యూనిస్టులు..!
బలమైన స్థానంలోనూ పోటీ చేయలేని దుస్థితి
గతంలో దూరం పెట్టిన నాయకుడికే జై కొట్టే స్థితి
పోరాటాన్ని వదిలేసి అవినీతి పరులకు అండ
అంటకాగిన వాళ్ల చేతే తన్నులు తినే పరిస్థితి
పార్టీ ఎదుగుదలకు బడా నాయకులే అవరోధం
కమ్యూనిస్టులు.. పోరాటానికి మారుపేరు.. ప్రజల్లోనే ఉంటూ.. ప్రజల కోసమే బతుకుతూ.. ప్రజల కోసమే ప్రాణాలు అర్పించే యోధులు.. అవినీతికి ఆమడ దూరంలో ఉంటూ.. అవినీతిపరుల వెన్నులో వణుకు పుట్టించే వాళ్లు.. అధికార పీఠం ఆహ్వానించినా వద్దంటూ.. ప్రజలకే అధికారం వచ్చే వరకూ పోరాడతామని కంకణం కట్టుకున్న వాళ్లు.. అయితే.. ఇదంతా గతం.. ఇప్పటి కమ్యూనిస్టులు అవినీతిపరులకు అండగా నిలిస్తూ.. అవినీతిపరులు దోచుకునే అవినీతి సొమ్ములో కొంత విదిలిస్తే అందుకునేందుకు అర్రులు చాపుతూ.. ఎంతకైనా దిగజారే వాళ్లే కమ్యూనిస్టులు.. అనే అపవాదును మూటగట్టుకున్నారని ప్రజలు విమర్శించే దుస్థితికి దిగజారారు.

తన బలాన్నే గుర్తించలేని స్థితిలో..
మునుగోడు నియోజక వర్గాన్నే తీసుకుంటే.. అది కమ్యూనిస్టులకు పెట్టని కోట. కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏకంగా ఐదు సార్లు ఎన్నికయ్యారు. అక్కడ ఇప్పటికీ కమ్యూనిస్టులకు పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. అభ్యర్థి గెలుపోటములను నిర్ణయించే శక్తి కూడా ఉంది. ఎలాంటి బలం లేని పార్టీలే అభ్యర్థులను నిలబెడుతూ.. విజయం కోసం తాపత్రయ పడుతుంటే.. ఇంతటి బలమైన స్థానంలో కమ్యూనిస్టులు ఒక అధికార పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడాన్ని స్థానిక కమ్యూనిస్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా.. వీళ్లు ఇప్పుడు మద్దతు పలికిన పార్టీ నాయకుడు గత ఎనిమిదేళ్లలో కమ్యూనిస్టులను దగ్గరికి కూడా రానివ్వలేదు. అంతేకాదు.. కమ్యూనిస్టులను లెక్కలోకి కూడా తీసుకోకుండా.. వాళ్లను అణిచేసేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు.

అవమానించిన నాయకుడి చెంతకే..
కమ్యూనిస్టులను ఇంతగా దూరం పెట్టిన ఆ నాయకుడికి అకస్మాత్తుగా కమ్యూనిస్టులపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది..? అంటే.. ఏమీలేదు.. నియోజక వర్గంలో కమ్యూనిస్టులే గుర్తించని వాళ్ల బలాన్ని ఆ నాయకుడు గుర్తించాడు. ముందుగానే వాళ్లకు గాలం వేశాడు. ఆ గాలానికి సీపీఐ, సీపీఎం చేపలు చిక్కాయి. తన గడీలాంటి ప్రగతి భవన్ గేటు కూడా దాటేందుకు గతంలో అనుమతి ఇవ్వని ఆ బడా నాయకుడు.. ఇప్పుడు పిలిచి మరీ విందు ఇచ్చి, బుజ్జగించాడు. ఆ బుజ్జగింపులకు మహా కమ్యూనిస్టు యోధులు పడిపోయారు. ఇప్పుడు బుజ్జగించిన పార్టీ నాయకుల చేతిలో తమ కార్యకర్తలు, నాయకులు గతంలో అనుభవించిన కష్టాలు, అవమానాలను ఈ కమ్యూనిస్టు యోధులు మర్చిపోయారు. ఎనిమిదేళ్లలో లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని విమర్శించిన ఈ కమ్యూనిస్టు యోధులే ఆయనకు జీ హుజూర్ అన్నారు.

అంటకాగిన వాళ్ల చేతే తన్నులు..
పైగా.. బీజేపీని ఓడించేందుకే టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చామంటూ కవరింగ్ ఒకటి. బీజేపీని ఓడించేందుకు వీళ్ల వద్ద అసలు ఎలాంటి వ్యూహమూ లేదు. అదే ఉంటే.. బీజేపీ 2 సీట్ల నుంచి దేశంలోనే ఎదురులేని శక్తిగా ఎదుగుతుంటే.. 50-60 సీట్లతో ప్రధానమంత్రినే నిర్ణయించే స్థానంలో ఉన్న కమ్యూనిస్టులు.. ఇప్పుడు టార్చిలైట్ పెట్టి వెతికినా కనిపించని స్థితికి చేరుకునేదే కాదు. లౌకికవాదం పేరుతో అవినీతి పార్టీలకు అంటకాగుతూ.. ఆ అవినీతిపరులు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల చేతిలోనే తన్నులు (పోలీసులు, పార్టీ నాయకుల చేత) తినే పరిస్థితి కమ్యూనిస్టులకు దాపురించేది కాదు. రోజురోజుకూ దిగజారుతూ.. అవినీతిపరులు విదిల్చే అవినీతి సొమ్ము కోసం దేవురించే స్థితికి దిగజారేవాళ్లే కాదు.

బడా నాయకులే పెద్ద అవరోధం..
నిజం చెప్పాలంటే.. ప్రజల్లో కమ్యూనిస్టు పార్టీని అభిమానించే వాళ్లకు కొదవే లేదు. సమస్యల్లా.. పార్టీని నడిపిస్తున్నామంటున్న కమ్యూనిస్టు బడా నాయకులతోనే. ప్రజా పోరాటాలను వదిలేసి.. ఎలాంటి వ్యూహం లేకుండా.. రోజుకో పార్టీకి తోకగా మారుతూ.. వాళ్ల చేతే అణిచివేతకు గురవుతూ.. పార్టీని నమ్ముకొని వచ్చిన కార్యకర్తలను, చోటా నాయకులను నట్టేటా ముంచుతూ.. కమ్యూనిస్టు పార్టీని రాష్ట్ర స్థాయిలోనూ.. జాతీయ స్థాయిలోనూ టైంపాస్‌గా నడిపిస్తున్న పెద్ద నాయకులే పార్టీకి పెద్ద అవరోధంగా నిలిచారని ప్రజలు, కమ్యూనిస్టు పార్టీ అభిమానులు చెప్పుకుంటున్నారు.

మజ్లిస్, బీఆర్‌ఎస్ కంటే తీసిపోయారా..
హైదరాబాద్‌లోని పాతబస్తీకే పరిమితమైన మజ్లిస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తూ.. ఎన్ని విమర్శలు ఎదురైనా అన్ని రాష్ట్రాల్లో ఒంటరిగా పోరాడుతున్న మజ్లిస్ పార్టీ కంటే కమ్యూనిస్టు పార్టీ తీసిపోయిందా.. అని ఆ పార్టీ అభిమానులు నిర్వేదంతో ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పేరుతో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా అవతరించడాన్ని ఆహ్వానిస్తున్నామని దేశంలోని పేద ప్రజల కోసం పుట్టిన కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ జాతీయ నాయకుడు అనడం అతి పెద్ద వింత అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు అంటే ఇదేనేమో అని ఆవేదన చెందుతున్నారు.

