స్థానిక ఎన్నికలలో మాదే విజయం
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ పరిస్థితి బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. స్థానిక ఎన్నికలు నిర్వహించినట్లయితే, బీఆర్‌ఎస్ సుమారు 80 శాతం స్థానాల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు జూలై 17న తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో రైల్‌రోకో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆమె గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, జాగృతి నాయకులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు. సమస్యలుంటే కేటీఆర్‌కు లేఖ ద్వారా తెలియజేయాలని తెలిపారు. జాగృతి కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ నాయకుల సహకారం కూడా లభిస్తోందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టత ఇవ్వాలని కోరారు.

