ప్రపంచసుందరి ‘ఓపల్ సుచాత’ ప్రత్యేకతలివే..
విశ్వనగరం హైదరాబాద్ వేదికగా గ్రాండ్‌గా జరిగిన ‘మిస్ వరల్డ్ 2025’ గ్రాండ్ ఫినాలేలో 72వ మిస్ వరల్డ్‌గా థాయ్‌లాండ్ సుందరి ఓపెల్ సుచాత చువాంగ్‌శ్రీ గెలుపొందారు. ‘బ్యూటీ విత్ పర్పస్’ నినాదంతో నిర్వహించిన ఈ ఏడాది పోటీలలో ఆమె ఇచ్చిన అత్యున్నత సమాధానాలు ఆమెను మొదటి స్థానంలో నిలబెట్టాయి. కేవలం శారీరక అందమే కాకుండా మంచి మనసు, పదిమందికి సహాయపడే గుణం ఆమెను గెలిపించాయి. 16 ఏళ్ల చిన్నవయసులోనే ఆమెకు రొమ్ములో ఒక కణితి ఉన్నట్లు కనిపెట్టడంతో క్యాన్సర్‌గా మారకముందే దానిని వైద్యులు తొలగించారు. దీనితో ఆమె క్యాన్సర్‌పై అవగాహన పెంచడానికి ‘ఓపెల్ ఫర్ హర్’ అనే ప్రాజెక్టుతో రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించేలా చేయడానికి నిధులు సేకరిస్తూ క్యాన్సర్ పేషంట్లను ఆదుకుంటున్నారు. టాప్ -4లో న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు అత్యుత్తమ సమాధానాలు చెప్పి వారి మెప్పును పొందారు సుచాత. మొదటి స్థానంలో మిస్ థాయ్‌లాండ్ మిస్ వరల్డ్‌గా నిలువగా, టాప్ 4లో ఇథియోపియా, పోలెండ్, మార్టినిక్ దేశాల అందగత్తెలు నిలిచారు. మిస్ ఇండియా నందినీగుప్తా టాప్ 20కి పరిమితమయ్యారు. ఆమెకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ అందింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి అతిథులుగా విచ్చేశారు. పలువురు సినీనటులు, సెలబ్రెటీస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



 
							 
							