InternationalNewsNews Alert

మొన్న లాడెన్… ఇప్పుడు జవహరి… డబ్బు కోసం పాకిస్తాన్ పాట్లు

Share with

బిన్ లాడెన్‌తో సన్నిహిత సంబంధాలున్న ఆల్‌ఖైదా అధినేత ఆల్ జవహరీని అమెరికా చాలా చాకచక్యంగా చంపేసింది. ఏ రకమైన పేలుళ్లు లేకుండా నిశ్శబ్దంగా క్షిపణి- హెల్‌ఫైర్ R9X  అనే రహస్య ఆయుధంతో అంతమొందించింది. అతని ఆచూకీ గురించి అమెరికా బలగాలకు పాకిస్థానే తెలియజేసి ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. జవహరీ ఈ ఏడాది ఆరంభం లోనే పాకిస్తాన్ నుండి ఆఫ్గాన్‌లో స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు.

ఇంటి బాల్కనీలో నిల్చొనే అలవాటు ఈఉగ్రనేతకు ఉందని ఖచ్చితంగా ఆ ప్రదేశంలో ఉన్నది అతనేని చెప్పడం పాక్ పనేనని భావిస్తున్నారు. పాక్ చాలాకాలంగా అమెరికా ప్రాపకం సంపాదించాలని ఎదురుచూస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుండి ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ అమెరికా మెప్పు కోసం జవహరీ వివరాలను CIA కు ఇచ్చి ఉంటుందని తెలుస్తోంది. లేదా అల్ ‌ఖైదా మళ్లీ అఫ్గాన్‌లో పాతుకుపోతోందని భావించిన తాలిబన్లు కూడా ఈ పని చేసి ఉండవచ్చు.  భారత్‌కు ఈ అంశం చాలా ముఖ్యమైనదని భావించవచ్చు. ఎందుకంటే ఈ ఉగ్రనేతకు ఏకంగా రాజధాని కాబూల్‌లోనే ఆశ్రయం దొరికింది. ఇలాంటి అవకాశాలు ప్రధానంగా భారత్‌పై దాడులకు పాల్పడే ఉగ్ర సంస్థలకు కూడా విస్తరించే ప్రమాదం ఉంది. జవహరీ భారత్ అంతర్గత విషయాలలో కూడా కలుగజేసుకునేవాడు., హీజాబ్ వివాదంలో ఇస్లాంపై దాడికి భారత్ మీడియాను ఉపయోగించుకుంటోందని, హిందూ పురుషుల గుంపును ఎదిరించిన ముస్లిం విద్యార్థిని మస్కాన్‌ఖాన్ జిహాద్ స్ఫూర్తిని రగిలించిందని ప్రశంసల వర్షం కురిపించాడు. ఆయన గతంలో కూడా చాలా వీడియోలలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేవాడు.

ఆఫ్గాన్‌లో అల్‌ఖైదాకు విపరీతమైన స్వేచ్ఛ ఉందనిపిస్తోంది. ఇక తాలిబన్లతో భారత్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టాక భారత ప్రభుత్వం అక్కడినుండి మన పౌరులను, అధికారులను దాదాపుగా ఇండియాకు తిరిగి తీసుకువచ్చింది. భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ కు చెందిన కొందరు ముస్లింయువకులు అఫ్గాన్ లోని వివిధ ప్రదేశాలలో జిహాదీ శిక్షణ పొందుతున్నట్లు జూన్‌లో UNO ఒక నివేదికలో తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్ మానవతా సాయాన్ని అందిస్తూనే ఉగ్రవాద కార్యకలాపాలపై కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.