ఏపీ మంత్రి జయరాంకు నోటీసులు
గత కొద్దిరోజుల నుండి ఐటీ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జల్లెడ పడుతున్నారు. తాజాగా ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం, ఆయన భార్య రేణుకమ్మతోపాటు, ఆలూరు సబ్ రిజిస్ట్రార్‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. రేణుకమ్మ పేరుతో ఆస్పరి మండలం చిన్నహోతురు, ఆస్పరిలో 30.83 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన వ్యవహారంపై ఐటీశాఖ అక్టోబర్ 30న మంత్రి జయరాం, రేణుకమ్మ, ఆలూరు సబ్‌రిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ భూమి కొనుగోలు చేసేందుకు మంత్రి జయరాం డబ్బులు చెల్లించారని ఐటీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అయితే.. తమకు ఎలాంటి ఐటీ నోటీసులు అందలేదని మంత్రి జయరాం తెలిపారు. ఆలూరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని ఛానెళ్లు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న తాము 30 ఎకరాల భూమి కొనుగోలు చేశామని వెల్లడించారు.

