NewsTelangana

మునుగోడులో నేటి నుంచి నామినేషన్లు

మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం షురూ అయింది. శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు చండూరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉప ఎన్నికల పోరు నోటిఫికేషన్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఉదయం 11 గంటలకు జారీ చేస్తారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జగన్నాథరావును నియమించారు. ఈ నెల 14వ తేదీ వరకు రెండో శనివారం, ఆదివారం మినహా రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.

నామినేషన్ల పరిశీలన ఈ నెల 15వ తేదీన ఉంటుంది. 17వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఇక పోలింగ్‌ నవంబరు 3వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. నవంబరు 6వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఈ నెల 10వ తేదీన నామినేషన్‌ వేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 14వ తేదీన నామినేషన్‌ దాఖలు చేస్తారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటిస్తారని.. ఆయన ఈ నెల 13 లేదా 14వ తేదీన నామినేషన్‌ వేస్తారని సమాచారం.