స్పీకర్‌కు ఆడియన్స్ కరువు…
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ది విలక్షణ శైలి. రాజకీయాల్లో ఆయన ఉత్థానపతనాలను చూశారు. గత కొన్నాళ్లుగా నడిచిన బ్యాడ్ టైమ్ 2019 ఎన్నికల్లో గుడ్ టైమ్‌గా మారింది. కేబినెట్ మంత్రి పదవి ఆశించినా తమ్మినేనికి జగన్మోహన్ రెడ్డి స్పీకర్ పోస్టు ఇచ్చి సరిపెట్టేశారు. అంతేకాదు.. స్పీకర్ పోస్టుతోపాటు… టీడీపీపై ఉన్న కసంతా తీర్చుకునేందుకు అన్ని విధాలుగా ఆయనకు మద్దతిచ్చారు. ఇటీవల జరిగిన పునర్‌వ్యవస్థీకరణలో తమ్మినేనికి ఛాన్స్ వస్తుందని అందరూ భావించారు కానీ ఆశలు అడియాశలయ్యాయ్. ఆమదాలవలసలో ఇప్పటికే బలంగా ఉన్న టీడీపీ… పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ కాస్కో మంటోంది. సొంత బంధువు రవికుమార్‌పై పగలు, ప్రతీకారాలంటూ రెచ్చిపోతున్న మంత్రికి.. జిల్లాలో అటు వైసీపీ నాయకులతో సఖ్యత లేదన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అంతే కాదు… ఆయన మాటను మన్నించే వారు కూడా లేరనే చెప్పాలి. తాజాగా ఆమదాలవలసలో జరిగిన కార్యక్రమంలో పార్టీ ముఖ్యులెవరూ కూడా పాల్గొనలేదు. సరే ఆ సంగతి పగ్గనబెడితే… కార్యకర్తలూ సభకు హాజరుకాకపోవడం విశేషం. ఇంకా చెప్పాలంటే జనం కూడా స్పీకర్ కార్యక్రమానికి హాజరు కాలేదు. సమావేశంలో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయ్. ఇంకా రెండేళ్లపాటు స్పీకర్ హోదా ఉన్నా… తమ్మినేనికి జనం ఫాలోయింగ్ ఇంతేనా అని పార్టీ నేతలు గుసగులాడుకుంటున్నారు.