ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతివ్వలే…
టీఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి)ని బీఆర్‌ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మార్చుతూ తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కేసీఆర్ జాతీయ పార్టీపై తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతుంటే.. దేశంలోని ఏ పార్టీ కూడా దీనిపై కామెంట్ చేయలేదంటే ఆశ్యర్యం కలగకమానదు. ఈ మధ్య కాలంలో సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతలను కలిశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్ ఇలా పలు రాష్ట్రాల ముఖ్యనేతలను కలిశారు. కాంగ్రెస్ పార్టీ మినహా… జాతీయ రాజకీయాల్లో విపక్షాలన్నీ ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా ఎలా పోరాడాలనే అంశంపై చర్చించారు.

సీఎం కేసీఆర్ మాట్లాడిన ప్రతిసారీ బీజేపీ ముక్త్ భారత్ అంటూ నినాదాలు ఇస్తున్నారు కానీ గ్రౌండ్ లెవల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా దానిని ఆమోదించడం లేదు. టీఆర్‌ఎస్‌కు అనుకూలమైన పార్టీ మజ్లిస్ నుంచి RJD, AAP, TMC, DMK, CPM, శివసేన వంటి ఇతర ప్రతిపక్ష పార్టీలు CM కేసీఆర్ నిర్ణయాన్ని అస్సలు సమర్థించలేదు. ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వకపోవడంతో… సీఎం కేసీఆర్‌కు క్షేత్రస్థాయిలో ఎలాంటి మద్దతు లేదని స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ పార్టీ గేమ్ చేంజర్ అని ఆ పార్టీ నేతలు చెబుతుంటే… కేసీఆర్ నేమ్ చేంజర్ అయ్యారని.. ప్రజలు త్వరలో ఫేట్ చేంజ్ చేస్తారంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో పాలించడం చేతకాలేదు కానీ… దేశాన్ని ఉద్ధరిస్తారా అంటూ కాంగ్రెస్, బీజేపీలు దుయ్యబడుతున్నాయి. 1947 నుంచి అనేక ప్రాంతీయ పార్టీలు AIDMK, DMK, TDP, SP, BSP, RJD, JD (U), TMC, AAP పార్టీలు జాతీయ పార్టీగా ఎదగాలని ప్రయత్నించి విఫలమయ్యాయని కాంగ్రెస్, బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడం ద్వారా ఒక పార్టీ జాతీయ పార్టీగా ఎలా అవతరిస్తుందని నేతలు ప్రశ్నిస్తున్నారు. జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే పలు రాష్ట్రాల్లో కొంత మేర ఓట్లు రావాల్సి ఉంది. ‘తెలంగాణ మోడల్’ దేశానికి ఆదర్శమని టీఆర్ఎస్ చెప్పడం అర్థ రహితమని విపక్షాలు ఆరోపిస్తున్నాయ్. ఉనికిలో లేని మోడల్‌ను దేశంలో అమలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నాయ్. టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడం వల్ల తెలంగాణ సొంతగడ్డను కోల్పోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణ పేరును నేడు సీఎం కేసీఆర్ చంపేశారని, ఇది చాలా దౌర్భాగ్యమని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తన రాజకీయాలు మనుగడ సాగించలేవని గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ పేరును ప్రజల నుంచి చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

