NationalNews

24న నితీశ్‌ బల నిరూపణ.. 16న కేబినెట్‌ విస్తరణ

Share with

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఈ నెల 24వ తేదీన అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని భావిస్తున్నారు. 16వ తేదీన తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాల కూటమి మద్దతుతో 8వసారి బిహార్‌ ప్రభుత్వ పగ్గాలు చేపట్టే ముందు తనకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు నితీశ్‌ తెలిపారు. 243 మందితో కూడిన బిహార్‌ అసెంబ్లీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 122. ఈ మ్యాజిక్‌ ఫిగర్‌ను సునాయాసంగా అధిగమిస్తాననే ధీమాతో నితీశ్‌, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ ఉన్నారు. అయితే, అసెంబ్లీ స్పీకర్‌గా ఇప్పటికీ బీజేపీకి చెందిన విజయ్‌ కుమార్‌ సిన్హా ఉన్నారు. దీంతో తొలుత స్పీకర్‌ను మార్చి తర్వాత బల నిరూపణ చేయాలని నితీశ్‌, తేజస్వి భావిస్తున్నారు. ఇప్పటికే మహాకూటమికి చెందిన 55 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌పై అవిశ్వాసం ప్రకటించారు. నిబంధనల ప్రకారం దీనిపై రెండు వారాల తర్వాతే సభలో చర్చకు అనుమతి లభిస్తుంది. సిన్హా అంతకు ముందే రాజీనామా చేస్తే 24వ తేదీన ఆర్జేడీకి చెందిన కొత్త స్పీకర్‌ను ఎన్నుకుంటారు. తర్వాత అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకునే అవకాశం ఉంది.