NewsNews Alert

పోషకాల పప్పుదినుసులు తింటున్నారా…

Share with

మనం చిన్నప్పుడు అమ్మచేతి గోరుముద్ద తినే ఉంటాం. తర్వాత ఎన్ని రుచులు తిన్నా చిన్ననాటి ముద్దపప్పు రుచిని, అమ్మ చూపించిన జాబిల్లిని మరిచిపోలేము. వేడివేడి అన్నంలో ముద్దపప్పు కలిపి నెయ్యి వేసుకుని తింటే దానిముందు పంచభక్ష్య పరమాన్నాలూ దిగదుడుపే.

ఈ పప్పు దినుసుల్లో ఎంత బలం, ఆరోగ్యం ఉందో తెలిస్తే,  అందరూ తప్పకుండా ఒప్పుకుని తీరాల్సిందే. కందులు, పెసర్లు, శనగలు, బఠానీలు, వేరుశెనగ, మినుములు పేర్లు ఏమైనా అన్నీ రుచిగానే ఉంటాయి. పోషకాలలో కూడా ఇవి గొప్పవే. ఇవి తిన్నరోజున తొందరగా ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలుగుతుంది. సాధారణంగా పప్పుల్లో కొవ్వు తక్కువ. కొలెస్ట్రాల్ అసలే ఉండదు. రక్తంలో గ్లూకోజ్‌ను అదుపులో ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. వీటిలో ఐరన్, జింక్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి మంచి పోషకాలను అందిస్తాయి. ఎముకలకు పుష్ఠినిచ్చి, పెద్దప్రేగు, ప్రొస్టేట్, జీర్ణాశయ, పాంక్రియాస్ క్యాన్సర్ వంటి రకరకాల కేన్సర్లు రాకుండా ఇవి తోడ్పడతాయి. అలాగే BP, DIABETIC లను కంట్రోల్ చేయడానికి పనికివస్తాయి. పప్పుల్లో పిండి పదార్థాల కంటే పీచులు అధికంగా ఉంటాయి. అది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఒక కప్పు ఉడికించిన పప్పులో 230 కేలరీలు శక్తి, 17.9 కేలరీలు ప్రొటీన్, 0.8 గ్రాముల కొవ్వు, 15.6 గ్రాముల పీచు ఉంటాయి. అదే అన్నంతో కలిపి తింటే ప్రొటీన్ శాతం తగ్గిపోయి పిండిపదార్థాలు ఎక్కువవుతాయి. అందుకే అన్నం తక్కువ పరిమాణంలో పప్పులు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే మంచిది. శాఖాహారులకు పప్పుల వల్ల మాంసకృత్తులు కూడా అందుతాయి. తప్పకుండా భోజనంలో వీటిని భాగంగా తీసుకోవాలి.

అయితే “అతి సర్వత్రా వర్జయేత్” అన్నట్లు ఎక్కువ తీసుకుంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. చాలామందికి పప్పులు తింటే పేగుల్లో గ్యాస్ చేరుతుంది. దీనివల్ల కడుపునొప్పి, వికారం వంటివి రావచ్చు. అయితే పప్పులను నానబెట్టడం, ఉడకబెట్టడం, మొలకలెత్తించడం వంటివి చేసి ఆహారంగా తీసుకుంటే ఈ ఇబ్బంది తగ్గించుకోవచ్చు. అందువల్ల పప్పుదినుసులను తగిన మోతాదులో తీసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని పొందండి.