National

త్వరలో భారత్‌లో డ్రోన్ విహారం

Share with

రోజురోజుకీ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకచోటు నుండి మరొక చోటుకు వెళ్లడానికి రోడ్డు మార్గంలో కష్టమైన ప్రదేశాలలో డ్రోన్‌లను ఉపయోగించే టెక్నాలజీ ఇప్పటికే చాలా దేశాలలో అందుబాటులోకి వచ్చింది. కెమెరాలతో మానవుడు ప్రవేశించలేని జలపాతాలు, కొండచరియలలో వీడియోలు చిత్రీకరించడానికి కూడా డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నాము. అలాగే ఇప్పుడు అత్యాధునికంగా మనిషిని మోసుకెళ్లగల వరుణ డ్రోన్ భారత్‌లో సిద్దమయ్యింది. పూణెలోని సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ ఈ డ్రోన్‌ను తయారుచేసింది. తాజాగా దీని పనితీరును ప్రదర్శించింది. ఇది వస్తువులనే కాక  ఒక మనిషిని కూడా తీసుకెళ్లగలదు. ఇది 130 కిలోల బరువును మోయగలదు. నౌకల మధ్య రవాణా చేయగలదు. రక్షణ దళాలకు కూడా ఉపయోగపడగలదు. గాయపడిన సైనికులను శిబిరానికి చేర్చడానికి కూడా వాడుకోవచ్చు. అంతేకాక వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు తలెత్తితే గ్రామీణప్రాంతాల నుండి రోగిని తీసుకురావచ్చు. రోడ్డు మార్గానికి గంట సమయం పడితే దీనితో 15 నిముషాలలోనే చేరుకోవచ్చు. రానున్న 3-4 ఏళ్లలో దీనిని ఎయిర్ టాక్సీగా ఉపయోగించేలా చేయాలన్నది సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు మృదుల్ బబ్బర్ ఆశ. మరి మనకూ ఆ డ్రోన్‌లో విహరిస్తూ ఆకాశమార్గంలో ప్రయాణించాలని ఉంది కదూ…