తనను ఓడించిన వ్యక్తిని అభినందించిన నవీన్ పట్నాయక్
రాజకీయాలలో గొప్ప మనసున్న వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. మృదు స్వభావిగా పేరుతెచ్చుకుని, ఒడిస్సాను 25 ఏళ్లపాటు అప్రతిహతంగా పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓటమిని కూడా హుందాగా స్వీకరించారు. మంగళవారం అసెంబ్లీకి వచ్చిన ఆయన తనను ఓడించిన వ్యక్తికి అభినందనలు తెలిపి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు స్థానాలలో పోటీ చేసిన ఆయన బొలంగీర్ జిల్లాలోని కంటాబంజి నుండి ఓటమి పాలయ్యారు. గంజాం జిల్లాలోని హింజలి నుండి గెలుపొందారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీకి వచ్చి తనను కంటాబంజిలో గెలిచిన లక్ష్మణ్ బాగ్‌కు ‘మీరేనా నన్ను ఓడించింది.. మీకు కంగ్రాట్యులేషన్స్’ అంటూ చెప్పడంతో అక్కడున్న సీఎం మోహన్ మాఝి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనను ఎంతో మెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఆరోగ్యకర వాతావరణం రాజకీయాలలో ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.

