“గోల్డెన్ గ్లోబ్”ను కైవసం చేసుకున్న “నాటునాటు” సాంగ్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “RRR” చిత్రం విడుదలైనప్పటి నుండి రికార్డుల మోత మోగిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ ఆస్కార్‌కు నామినేట్ కావడమే కాకుండా రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. అంతేకాక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అరుదైన “గోల్డెన్ గ్లోబ్” అవార్డు కూడా వరించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి చిందులు వేసిన “నాటునాటు” అనే పాట ప్రేక్షకులను ఎంతగా ఉర్రూతలూగించిందో మనకు తెలుసు. ఇప్పడు అదే పాటకు కీరవాణికి ఈ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్తున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవికి అయితే పుత్రోత్సాహం పట్టలేనంతగా ఉంది. ఇదొక చారిత్రక విజయం అని, దేశమంతా ఎంతగానో గర్విస్తోందని ట్వీట్ చేశాడు. కీరవాణికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, “నాటునాటు” పాటకు కీరవాణి “గ్లోల్డెన్ గ్లోబ్” పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశాడు. సంగీతం, డాన్సులతో కూడిన గొప్ప సెలబ్రేషన్‌గా “నాటునాటు” పాట నిలిచిందని, ఈ రోజు ప్రపంచమే ఈ పాటకు డాన్స్ చేస్తోందంటూ చిత్రబృందాన్ని అభినందించాడు చిరంజీవి. ఆ పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు, సాహిత్యం అందించిన చంద్రబోస్‌కు, పాట పాడిన రాహుల్, కాలభైరవలకు, డాన్స్ చేసిన తారక్, రామ్ చరణ్‌లకు పేరు పేరునా “కంగ్రాట్స్” అంటూ అభినందనల వర్షం కురిపించారు మెగాస్టార్.
ఇంకా ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ తన జీవితంలో ఈ పాటకు ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నాడు. ఏఆర్ రహమాన్, అనుష్క, మోహన్ బాబు, దేవిశ్రీ ప్రసాద్, రవితేజ, నందినీ రెడ్డి వంటి సినీ ప్రముఖులు కూడా కీరవాణికి ప్రశంసల జల్లు కురిపించారు.

