Andhra PradeshNews

29న రాజీనామాకు సిద్ధపడ్డ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు…

రఘురామకృష్ణం రాజుకు కొత్త ఐడియా
నాటి జగన్ మాటలే… లక్ష్యంగా రాజకీయం
చంద్రబాబును బతిమిలాడే బాధ్యతన నాది…
టీడీపీ ఎంపీలను ఒప్పించే బాధ్యత తీసుకుంటారట…

గతంలో ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని ప్రతిపాదించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల చివరి రోజు మరొకసారి ఎంపీల మూకుమ్మడి రాజీనామాలకు ప్రతిపాదన చేయాలన్నారు నర్సాపురం ఎంపీ, రఘురామకృష్ణంరాజు. పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కాళ్ళ వెళ్ళా పడి బతిమాలుదామన్న ఆయన, ముగ్గురు టీడీపీ ఎంపీలను రాజీనామాకు ఒప్పించే బాధ్యతను తానే తీసుకుంటానన్నారు. రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలకు గాను 25 మంది ఎంపీలు రాజీనామా చేయడం ద్వారా కేంద్రం పై వత్తిడికి తీసుకొద్దామని సూచించారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ … ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఆ హామీని విస్మరిస్తే ప్రజలు అసహ్యించుకుంటారని చెప్పారు.

జగన్ మాటలకు అర్ధాలే లేవులే
జగన్మోహన్ రెడ్డి పాలన అంతా తిరోగమన దిశలో సాగుతుందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. అవునంటే కాదనిలే… కాదంటే అవుననిలే… జగన్ మాటలకు అర్ధాలే లేవులే అని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికే 50 వేలమంది తాత్కాలిక ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించారని తెలిపారు. మిగిలిన వారిని కూడా తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. ఎందుకంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు. ఐదో తేదీ వచ్చినప్పటికీ, 50 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులకు , 75 శాతం మంది ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేదని తెలిపారు.

ఈవీవీ, జంధ్యాల సినిమాలా కర్నూలు గర్జన సభ!
తెలుగు హాస్య దర్శకులు ఈవీవీ సత్యనారాయణ, జంధ్యాలలు రూపొందించిన హాస్య చిత్రం మాదిరిగా కర్నూలు గర్జన సభ కొనసాగిందని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. బ్రిటిష్ వారి పాలనలో మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోతే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఓ పదిమంది పెద్ద మనుషులు కూర్చుని చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రస్తావించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కర్నూలు గర్జన సభకు వాలంటీర్లు వెళ్లి మహిళలను బెదిరించినప్పటికీ, మహిళలు హాజరు కాలేదని తెలిపారు. స్కూల్లు మూసివేసి పరీక్షలను రద్దు చేసి, డ్వాక్రా మహిళలను బెదిరించి సభకు తరలించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

సీమవాసులను చూస్తే జాలి వేస్తోంది
రాయలసీమ వాసులను చూస్తే జాలి వేస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. కోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన రాజధాని అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. కేరళ హైకోర్టు కొచ్చిన్ లో ఉందన్న ఆయన, ఉత్తర ప్రదేశ్ లో హైకోర్టు అలహాబాదులో ఉందని గుర్తు చేశారు. అంతమాత్రాన వాటిని న్యాయ రాజధానులు అని పిలుస్తారా అంటూ ప్రశ్నించారు. కొంతమంది బుద్ధిహీనులు పిచ్చి ప్రేలాపనలతో ప్రజలని మభ్య పెట్టాలని ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టులో మాత్రం హైకోర్టు ఏర్పాటుపై మాట మార్చిందని గుర్తు చేశారు.

శ్రీ బాగ్ ఒప్పందంలో ఏముంది?
1937లో చేసుకున్న శ్రీ బాగ్ ఒప్పందంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని ఉందని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావులు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే, రాయలసీమ బంగారు మయమవుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. 34 వేల కోట్ల రూపాయలతో రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటి వరకు కేవలం 1700 కోట్ల రూపాయల పనులను మాత్రమే చేయించారన్నారు. అందులో 1100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించకుండా ఎగ్గొట్టారని తెలిపారు.

రైతు సభకు అనుమతి ఇవ్వరా?
పుంగనూరు నియోజకవర్గంలో పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు సభ ఏర్పాటు చేయాలని భావిస్తే, తమ ప్రభుత్వం అనుమతించలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. బీసీలు తమ పార్టీకి వెన్నుముక అని చెబుతూ, బీసీ గర్జన నిర్వహిస్తున్న తమ పార్టీ పెద్దలు.. పుంగనూరు నియోజకవర్గంలో పాడి రైతుల గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తున్న రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేసి, తమ పార్టీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారన్నారు. రైతు సభ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడంతో, అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి దండం పెట్టి… తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేయడమే ఆయన చేసిన పాపమన్నారు. ఒకవైపు జనసేన కార్యకర్తలను రౌడీ సేన అని సంబోధిస్తూ… తమ పార్టీ కార్యకర్తలు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు.