InternationalNews

సునక్‌తో కూతురి పెళ్లికి నారాయణ మూర్తి నో..!

బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి చేపట్టనున్న తొలి శ్వేత జాతియేతర వ్యక్తిగా భారత సంతతికి చెందిన రిషి సునక్‌  సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన ఇన్ఫోసిస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేత నారాయణ మూర్తి అల్లుడు అనే విషయం తెలిసిందే. రిషి సునక్‌ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆయన భార్య, నారాయణ మూర్తి కుమార్తె అక్షత పాత్ర ఎంతో ఉంది. అయితే.. ఆయనకు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేందుకు నారాయణ మూర్తి తొలుత ససేమిరా అన్నారట. నారాయణ మూర్తి కుమార్తె అక్షతకు రిషి సునక్‌తో పరిచయం ఎలా ఏర్పడింది..? ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది..? ఈ పెళ్లికి నారాయణ మూర్తి ఎందుకు వద్దన్నారు..?

కాలేజీలోనే పరిచయం.. ప్రేమ

నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి ఫ్యాషన్‌ డిజైనర్‌. ఆమె స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ కూడా చేశారు. అదే యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన రిషి సునక్‌తో అక్షతకు కాలేజీలోనే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత స్నేహంగా మారింది. వాళ్లిద్దరూ నాలుగేళ్లు డేటింగ్‌ చేసి.. ఒకరినొకరు అర్ధం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే.. తమ పెళ్లి విషయాన్ని అక్షత తన తండ్రికి చెప్పినప్పుడు నారాయణ మూర్తి అంగీకరించలేదు. కానీ.. రిషి సునక్‌తో మాట్లాడిన తర్వాత.. ఆయన మాటలకు ఫ్లాట్‌ అయిన నారాయణ మూర్తి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఓకే అన్నారు. దీంతో వీరు ఆగస్టు 30, 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి ఇప్పటికి 13 సంవత్సరాలు పూర్తయ్యాయి.

నిరాడంబరంగా పెళ్లి..

నారాయణ మూర్తి తన కుమార్తె అక్షతకు రాసిన లేఖలోనూ రిషి సునక్‌ వ్యక్తిత్వాన్ని, నిజాయితీని కొనియాడారు. ఈ విషయాలను నారాయణ మూర్తి ‘లెగసీ: లెటర్స్‌ ఫ్రమ్‌ ఎమినెంట్‌ పేరెంట్స్‌ టు దేర్‌ డాటర్స్‌’ అనే పుస్తకంలోనూ ప్రస్తావించారు. నారాయణ మూర్తికి వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ తన కూతురి పెళ్లిని బెంగళూరులో సాంప్రదాయ పద్ధతిలో నిరాడంబరంగా జరపడం విశేషం. అతిథులకు సాధారణ సౌత్‌ ఇండియన్‌ ఫుడ్‌తో విందు ఇచ్చారు. వారి పెళ్లికి విప్రో చైర్మన్‌ అజీం ప్రేమ్‌ జీ, క్రికెటర్లు రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లేతో సహా 500 మంది మాత్రమే హాజరయ్యారు. అక్షతా డిజైన్స్‌ పేరుతో ఫ్యాషన్‌ డిజైన్‌ వ్యాపారాన్ని అక్షత 2010లో ప్రారంభించారు. 2011లో మూరుమూల గ్రామాల్లోని కళాకారులతో కలిసి భారతీయ సంస్కృతిని కనిపెట్టే వెస్ట్రన్‌ ఫ్యూజన్‌ దుస్తులను రూపొందించారు.

రిషి సునక్‌ పూర్వికులు పంజాబీలు

పంజాబీ ఖత్రీ కుటుంబానికి చెందిన రిషి సునక్‌ తాత రాందాస్‌ సునక్‌ పంజాబ్‌లోని గుజ్రాన్‌వాలా జిల్లాకు చెందిన వారు. ఈ ప్రాంతం ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉంది. రాందాస్‌ సునక్‌ క్లర్క్‌ ఉద్యోగం కోసం 1935లో కెన్యా రాజధాని నైరోబీకి వలస వెళ్లారు. సునక్‌ తండ్రి యశ్వీర్‌ నైరోబీలోనే పుట్టారు. తల్లి ఉష భారత్‌ నుంచి టాంజానియాకు వలస వెళ్లిన భారత సంతతి కుటుంబానికి చెందిన మహిళ. డాక్టర్‌ అయిన యశ్వీర్‌ కుటుంబం బ్రిటన్‌కు వలస వెళ్లిన తర్వాత సునక్‌ మే12, 1980లో సౌతాంప్టన్‌లో పుట్టారు. సునక్‌ తల్లి ఉష ఫార్మసిస్టు. రిషి సునక్‌కు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. పెద్దవాడైన రిషి సునక్‌ డిగ్రీని మించెస్టర్‌ కాలేజీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో చేశారు. సునక్‌కు లండన్‌లోని కెన్సింగ్టన్‌లో 7 మిలియన్‌ పౌండ్ల విలువైన 5 పడక గదుల ఇల్లుతో సహా నాలుగంతస్తుల భవనం ఉంది. కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఒక ఫ్లాట్‌ కూడా ఉంది.