Home Page SliderTelangana

రేవంత్‌ రెడ్డికి నాగం కౌంటర్, ఓడించేదాక తగ్గేదేలే!

ఎన్నికల వేళ పార్టీల మధ్య కుమ్ములాటలు, విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో వింత పరిస్థితి నెలకొంది. సొంత పార్టీ అధ్యక్షునికే సవాళ్లు విసురుతున్నారు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్‌కు చెందిన నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం, కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తాననడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నాగర్ కర్నూల్‌కు చెందిన నాగం జనార్థన్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డిపై విమర్శలు కుప్పించారు.  కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారన్నారు. కాగా రేవంత్ పార్టీలో ప్యారాచూట్ నాయకులకు మాత్రమే టికెట్ కేటాయిస్తున్నారని, టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులకు రేవంత్ రెడ్డి అన్యాయం చేసి..వాళ్ల బతుకులను ఆగం చేశారని నాగం జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ అయిన నాగం, అదే పార్టీలో జూనియర్ అయిన రేవంత్ రెడ్డిని ఇప్పుడు కాంగ్రెస్‌లో కూడా నీడలా వెంటాడుతున్నారు.

ఇంతగా రెచ్చిపోతున్న నాగం జనార్థన్ రెడ్డి ఒకే పార్టీకి కట్టుబడి ఉన్న పతివ్రతేం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ భూమ్‌లో ఉన్నప్పుడు తెలుగుదేశం తరపున నాగర్ కర్నూల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, ఆరోగ్య శాఖా మంత్రిగా 1995 నుండి 2004 వరకూ పనిచేశారు. అనంతరం అతని పార్టీ వ్యతిరేఖ విధానాలతో 2011 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేయబడ్డారు. వెంటనే మారు మాట లేకుండా తెలంగాణ ఉద్యమం అంటూ కొత్త రాగం వినిపించారు. ‘తెలంగాణ నగర సమితి’ అనే పార్టీని స్థాపించి,  దానిని బీజేపీలో విలీనం చేశారు. 2012లో వెంటనే ఇండిపెండెంటుగా అదే నియోజక వర్గం నుండి పోటీ చేసి, గెలిచారు. మరలా బీజేపీలో చేరారు. 2018లో ఏమెచ్చిందో బీజేపీని వదిలి, కాంగ్రెస్‌లో చేరారు. ఇలా రాష్ట్రంలో ఏపార్టీని విడిచిపెట్టకుండా కప్పగెంతులు వేస్తూ, కాంగ్రెస్‌లో చేరిన ఈయన ఇప్పుడు కాంగ్రెస్‌పై విమర్శలకు దిగడం చూస్తుంటే మళ్లీ పార్టే మారే సమయం ఆసన్నమయిందని రాజకీయ విమర్శకులు నవ్వుకుంటున్నారు.