NationalNews

మోదీ ఆస్తి రూ.2.24 కోట్లు.. సొంత వాహనం లేదు

Share with

ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు ఎంతో తెలుసా? అక్షరాలా 2.23 కోట్ల రూపాయలు. అందులో ఎక్కువగా బ్యాంకు డిపాజిట్లే. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన వాటాగా వచ్చిన ఓ స్థలాన్ని విరాళంగా ఇచ్చినందున ఆయనకు స్థిరాస్తులేమీ లేవు. ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 31వ తేదీ నాటికి మోదీ వద్ద ఎలాంటి బాండ్లు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు లేవు. 2002లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరో ముగ్గురితో కలిసి మోదీ ఓ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. 2021 మార్చి 31వ తేదీ నాటికి రూ.1.1 కోట్ల విలువైన ఆ స్థిరాస్తిని తర్వాత విరాళంగా ఇచ్చారు. తమ ఆస్తులను ప్రకటించిన మంత్రివర్గ సహచరుల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వద్ద ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.2.54 కోట్ల విలువైన చరాస్తులు, రూ.2.97 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.

మోదీ వద్ద ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.2,23,82,504.
మోదీకి సొంత వాహనం కూడా లేదు.
రూ.1.73 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి.
చరాస్తులు గతేడాదితో పోలిస్తే రూ.26.13 లక్షలు పెరిగాయి.
మోదీ చేతిలో రూ.35,250 నగదు ఉంది.
పోస్టాఫీసులో జాతీయ పొదుపు పత్రాల రూపంలో రూ.9,05,105 ఉన్నాయి.
ఆయన రూ.1,89,305 విలువైన జీవిత బీమా పాలసీని కూడా కలిగి ఉన్నారు.