NewsTelangana

మోదీ మెయిన్ ఫోకస్ తెలంగాణానే…

Share with

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయ్. అధికారంలో ఉన్న రాష్ట్రాలు, అక్కడ ఉన్న పరిస్థితులు… అధికారంలో ఉండాలంటే ఎలాంటి వైఖరి అలవంబించాలి… అధికారంలోకి రావాల్సిన రాష్ట్రాల్లో ఏం చేయాలన్నదానిపై పార్టీ సుదీర్ఘంగా చర్చించనుంది. ముఖ్యంగా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకునేందుకు ఎలాంటి వైఖరి అనుసరించాలన్నదానిపై పార్టీ వ్యూహ రచన చేయనుంది. కుటుంబపాలనకు చరమగీతం పాడాలన్న నినాదాన్ని హైదరాబాద్ వేదికగా ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో హెచ్ఐసీసీ వేదికగా కీలక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇవాళ రాత్రి 9 గంటల వరకు జరగనున్నాయ్. తిరిగి రేపు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయ్. తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న పార్టీ 119 నియోజకవర్గాల్లో పర్యటించిన నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించనుంది. రేపు సాయంత్రం పెరేడ్ గ్రౌండ్స్‌లో విజయసంకల్ప సభతో టీఆర్ఎస్‌పై పూర్తి స్థాయిలో యుద్ధాన్ని మోదీ ప్రకటిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. సమావేశాలకు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం, రక్షణ శాఖ మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్‌తో సహా18 రాష్ట్రాల సీఎంలు, 348 మంది ప్రతినిధులు హాజరయ్యారు.