మోదీ సోదరుడికి తప్పిన ప్రమాదం
ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీకి పెను ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని మైసూర్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీకి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు, మనుమడు ఉన్నారు. ఈ ప్రమాదంలో మోదీ మనుమడి కాలుకి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మైసూర్‌లోని జేఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రహ్లాద్ మోదీ తన కుటుంబంతో కలిసి మెర్సిడేస్ బెంజ్ కార్‌లో బందిపురాకు వెళ్తుండగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కాన్వాయ్ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు.


