సీఎం జగన్‌ను కలిసిన మంత్రి పువ్వాడ
గోదావరి వరదల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో పువ్వాడ అజయ్ కుమార్ చేసిన ఆరోపణలు రెండు రాష్ట్రాల అధికార పార్టీల మధ్య పోలవరం.. రణం రాజేసిన విషయం తెలిసిందే. పువ్వాడ అజయ్ కుమార్ తన కుమారుడి వివాహానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి సతీసమేతంగా తాడేపల్లికి రావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
సీఎం జగన్ ని కలిసేందుకు విజయవాడ వచ్చారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలసి నా కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు వచ్చానని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. వైఎస్ తో మా తండ్రికి సత్సంబంధాలు ఉండేవని పువ్వాడ గుర్తుచేశారు. సీఎం జగన్ మాకు మంచి ఆప్తుడు అని పువ్వాడ అన్నారు. టీఆర్ఎస్ ను ఢీ కొట్టే సత్తా ఎవరికి లేదని ,ఏ ఎన్నికైనా మాకు సాధారణంగానే ఉంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీకు గండి కొట్టాలంటే ఎవరి వల్ల కాదని, 21 ఏళ్లుగా అనేక ఒడుదుడుకులు టీఆర్ఎస్ ఎదుర్కొందన్నారు. కాంగ్రెస్ అంతర్గత వివాదాలపై మేం మాట్లాడమన్నారు. సీఎం జగన్‌తో ఎటువంటి రాజకీయ చర్చలు లేవని.. పూర్తిగా వ్యక్తిగతమైనదే నా పర్యటన అని వెల్లడించారు. రాజకీయాలతో ఈ భేటీకి సంబంధం లేదన్నారు పువ్వాడ అజయ్ కుమార్. కొద్దిరోజుల క్రితం భద్రాచలంలో పర్యటించిన అజయ్… గోదావరి వరదల నేపథ్యంలో పోలవరం వల్ల భద్రాచలానికి ముప్పు వుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని, తెలంగాణకు చెందిన విలీన గ్రామాలను ఆంధ్రాలో కలిపిన వాటిని తిరిగి తెలంగాణలో కలపాలన్నారు పువ్వాడ అజయ్.