మంత్రి జగదీశ్ అవినీతి చిట్టా బయట పెడతా: రాజగోపాల్ రెడ్డి
మంత్రి జగదీశ్ రెడ్డి అవినీతి చిట్టాను తాను త్వరలో బయట పెడతానని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోల్ రెడ్డి హెచ్చరించారు. మంత్రి పదవి లభించిన తర్వాత జగదీశ్ రూ.1000 కోట్లు కూడబెట్టుకున్నారన్నారు. ఆయనపై పలు హత్య కేసులున్నాయని, 14 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారని, జైలుకు కూడా వెళ్లారని రాజగోపాల్ చెప్పారు. అంతేకాదు.. నాగారంలో ఐదెకరాల్లో భారీ ఇల్లు కట్టుకున్న జగదీశ్ రెడ్డికి శంషాబాద్‌లో 70 ఎకరాల్లో ఫామ్‌హౌస్ కూడా ఉందని.. 2014లో సొంత ఇల్లు కూడా లేని జగదీశ్‌రెడ్డికి ఏడేళ్లలో ఇంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
నా ఆస్తులు అమ్ముకున్నా: రాజగోపాల్
తాను మాత్రం 2009 తర్వాత తన ఆస్తులను అమ్ముకున్నానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని తాను కాంట్రాక్టులు పొందినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని సవాల్ చేశారు. తాను 35 ఏళ్ల నుంచే కంపెనీని నడిపిస్తున్నానని, ఇప్పడు ఆ వ్యవహారాలు తన కుమారుడు చూసుకుంటున్నాడని రాజగోపాల్ వివరించారు. తాను ఇటీవల ఆస్తులు కూడబెట్టుకున్నట్లు నిరూపించలేకపోతే జగదీశ్‌రెడ్డి మంత్రి పదవికి, ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడులో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తానని, ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని చెప్పారు.