వైసీపీ నుంచి వలసలు షురూ…
అధినాయకత్వం దృష్టి సారించకపోవడమే కారణం
◆ పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత
◆ కేడర్ లో తగ్గిన జోష్
వైసీపీ అధికారంలోకొచ్చిన కొత్తలో కేడర్ ఉన్నంత జోష్ నేడు లేదు. కాలం గడిచేకొద్ది ఆ పార్టీలో హుషారు అవిరైపోయింది. సానుభూతి, ఒక్క అవకాశం, ఒకసారి చూద్దామని భావించిన ప్రజల, కేడర్ సాఫ్ట్ కార్నర్ ఆలోచనలు మూడేళ్లు గడిచేసరికి ఆ పార్టీ అధినాయకత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి. సాధారణ కార్యకర్త నుండి ఎమ్మెల్యే వరకు ఎవరిని పార్టీ అధినాయకత్వం పట్టించుకోకపోవటమే దీనికి కారణమని గుసగుసలు వినపడుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో చాలాకాలం నుంచి వర్గ విభేదాలు ఉన్నా, అవి ఇప్పుడు ముదిరి పాకాన పడుతున్నాయి. పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి అధిక ప్రాధాన్యత ఇస్తుండడం.. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్నవారికి ఇబ్బందికరంగా మారుతోంది. మొదట మంత్రి వర్గ విస్తరణతో.. పలువురి నేతల మధ్య విబేధాలు బహిర్గతమవుతున్నాయి. కీలక నేతలు సైతం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ వేడి చల్లారకముందే.. ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పరిస్థితులు ముదిరాయి. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గం పంచాయతీ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో ఈమధ్య రాజోలు వైసీపీ లో వర్గపోరు పార్టీ పెద్దలకు షాక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ తమకు 175 సీట్లు పక్కా అంటోంది.. ఆ దిశగా ఇప్పటికే అధినేత, సీఎం జగన్ కార్యచరణ కూడా సిద్ధం చేశారు. పార్టీలో వర్గ పోరును గుర్తిస్తూ.. అందరూ సమన్వయం చేసుకోవాలి అంటూ ఆదేశాలు ఇస్తూనే.. పార్టీ పటిష్టతపై ఫోకస్ చేశారు.. అలాగే ప్రజా ప్రతినిధులందరూ ప్రజలకు చేరువ అయ్యే విధంగా గడప గడపకు ప్రభుత్వం చేపట్టారు. ఆ తరువాత బస్సు యాత్ర కూడా చేశారు. ఇలా అధినేత ఓ వైపు పార్టీ పటిష్టతపై ఫోకస్ చేస్తే.. పార్టీ లో క్షేత్ర స్థాయి పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. ఈ మధ్యకాలంలో తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన రుద్రరాజు వెంకట రామరాజు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నవారిని పక్కన పెట్టి కొత్తగా జనసేన నుంచి పార్టీలోకి వచ్చినవారికి ప్రాముఖ్యత పెరుగుతోందిని ఆయన బహిరంగంగా ఆరోపించారు. వైసీపీ కోసం ఎన్నికలలో పని చేసిన వారిని పక్కన పెట్టి జనసేన నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడంపై రుద్రరాజు మండిపడ్డారు. ఇప్పటికైనా పార్టీ అధినాయకత్వం పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారిని గుర్తించి దృష్టిసారించకపోతే రానున్న రెండు సంవత్సరాల కాలంలో రుద్రరాజు లాగా వైసీపీ నుండి పార్టీ మారే నాయకులు లిస్ట్ బారీగానే ఉంటుదని విశ్లేషకులు అంటున్నారు.