వాతావరణకేంద్రం -వాతావరణ సూచన-హెచ్చరికలు
దక్షిణ ఒరిస్సా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి ఒరిస్సా తీరములో పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ఉపరితల ఆవర్తనం మరియు ఈస్ట్‌వెస్ట్ షీర్ జోన్ ఈ రోజు 20 డిగ్రీల ఉత్తరం నుండి సముద్రం మట్టంకి 3.1 కి.మీ నుండి 7.6 కి మీ ఎత్తు వరకు ఉత్తర భారతదేశం అంతటా వ్యాపించి, ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణం వైపుకి వంపు తిరిగి ఉంది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, కోట, మాండ్ల , రాయపూర్, ఝార్సిగూడ,తీవ్ర అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు హైదరాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, గత 2-3 రోజులుగా వర్షాలు,వరదలు కారణంగా తెలంగాణా జిల్లాల్లో ప్రజలు చాలా వరకు భారీ వర్షాల ప్రభావాన్నిఇప్పటికే అనుభవించారు. హైదరాబాద్ నగరంలో అనేక రహదారులు మరమత్తులకు గురై ట్రాఫిక్ అంతరాయాలకు దారితీశాయి. జూన్ 1న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి, తెలంగాణాలో సాధారణ వర్షపాతం 200 మిల్లీమీటర్లు, 391 మిల్లీమీటర్ల వర్షపాతంతో 95శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలో మొదటి పది రోజుల్లోనే 248 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో జూలై నెలలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది.
వాతావరణ శాఖ హెచ్చరికలు
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ, అతిభారీ అత్యంత భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉంది. మరియు తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలవల్ల తెలంగాణ రాష్ట్రంలో అనేక రిజర్వాయర్‌లను కూడా బాగా పొంగి,ప్రవహిస్తున్నాయి. దీనివల్ల హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఉస్మాన్‌సాగర్ మరియు హిమాయత్‌సాగర్ రిజర్వాయర్‌ల నుండి అదనపు నీటిని విడుదల చేయడానికి వరదగేట్లను ఎత్తివేయవలసి వచ్చింది. అవసరాన్ని బట్టి రాబోయే రోజుల్లో మరిన్ని తెరవవచ్చని అధికారులు తెలిపారు. 30 ఎమ్‌ఎమ్‌టిసి రైళ్లను కూడా బుధవారం వరకు రద్దు చేసారు.