ఏపీలో ఇక రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం: హోం శాఖ ఉత్తర్వులు
ప్రజల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లు, మార్జిన్లలో సభలు ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సభలు సమావేశాలకు ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు సూచించింది. రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని, ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు నిర్వహించుకోవాలని,అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో అనుమతి పొంది సభలు నిర్వహించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల కందుకూరు, గుంటూరులో టీడీపీ నిర్వహించిన సభల్లో తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హోంశాఖ హెచ్చరించింది.

