Andhra PradeshHome Page Slider

ఆర్టీసీ ఉద్యోగులకు గరిష్టంగా 40 వేల రూపాయల పెన్షన్‌

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో గరిష్టంగా 40 వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని, రవాణా శాఖ మంత్రి శ్రీ విశ్వరూప్‌  ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. అత్యధిక పెన్షన్‌ కోసం పీఎఫ్‌ ఫండ్‌ ట్రస్ట్‌కు తెలంగాణతో సహా వేరే రాష్ట్రాల సంస్థలు దరఖాస్తు (అప్‌లోడ్‌) చేసినా, కేవలం మన ఆర్టీసీకే ఆ అవకాశం వచ్చింది. సీఎంగారు చూపిన చొరవే దానికి ప్రధాన కారణమన్నారు. సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేసుకున్నారు.  ఆ వెంటనే రెండు నెలలకు కోవిడ్‌ వ్యాపించినా ఆర్టీసీకి నష్టం వచ్చినా, అప్పుడు ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడకుండా జీతాలు ఇచ్చి ఆదుకున్నారు.

గరిష్టపెన్షన్ విధానం:

50 వేలకు పైగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం కాగా, వారితో పాటు.. 2014 తర్వాత రిటైర్‌ అయిన దాదాపు 10,200 మంది ఉద్యోగులు, కార్మికులు అత్యధిక పెన్షన్‌ విధానంలో ప్రయోజనం పొందుతారు. దీనిపై ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సీఎంగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గతంలో వారికి కేవలం రూ. 3 వేల నుంచి రూ. 4 వేల పెన్షన్‌ మాత్రమే వచ్చేది. అదే ఇవాళ వారికి గౌరవప్రదమైన పెన్షన్‌ వస్తుంది. దీంతో ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఈరోజు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ఒక్కొ క్కరికి రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు పెన్షన్‌ వస్తుంది.

ఉద్యోగులకు కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డులు:

నాలుగేళ్లలో ఆర్టీసీ ఎంతో పురోగతి సాధించింది. పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాం. వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పీఆర్సీ అమలు చేస్తున్నాం. ఇంకా జనవరి 1, 2016 నుంచి డిసెంబరు 31, 2019 వరకు దాదాపు 858 మందికి కారుణ్య నియామకాల కింద వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఈహెచ్‌ఎస్‌ కార్డు వారికీ ఇచ్చాం.ప్రతి ఉద్యోగికి రూ. 40 లక్షల ప్రమాద బీమా, రూ. 5 లక్షల సహజ మరణ బీమా సదుపాయం కల్పిస్తున్నాం. ఇప్పటికే 390 కుటుంబాలకు ఆ బీమా ద్వారా లబ్ధి చేకూరింది. డ్రైవింగ్‌ వృత్తి చాలా కష్టం కాబట్టి, 55 ఏళ్లకు పైబడిన డ్రైవర్లకు వేరే బాధ్యతలు అప్పగించే విధంగా చూడాలని సీఎంగారిని కోరాలని నిర్ణయించాం. వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయం తీసుకున్నాం.

అవినీతికి తావులేని రవాణా వ్యవస్థ:

రవాణా శాఖ చెక్‌పోస్టుల్లో ఎక్కడా అవినీతి లేదు. అవినీతి అంటూ కొన్ని పత్రికలు రాస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ అవినీతి దృష్టికి వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా 1500 డీజిల్‌ బస్సులు, 1000 విద్యుత్‌ బస్సులు కొంటున్నాం. 15 ఏళ్లకు పైబడిన ప్రతి బస్సును స్క్రాప్‌ కింద తీసేస్తున్నాం. వాటి స్థానంలో అద్దె బస్సులు నడుపుతున్నాం. అవసరం మేరకు కొత్త బస్సులు కూడా కొంటున్నాం.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందని, అది మంచిది కాకపోతే మీరు అధికారంలోకి వస్తే దానిని తీసేస్తామని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఈరోజు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయంటే అందుకు వాలంటీర్లే కారణం అని, ప్రతీ 50 ఇళ్లకు ఉండే వాలంటీర్ ఆ ఇళ్లలోనే ఒకరుగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.