Breaking NewsHome Page Sliderhome page sliderInternational

ఇరాన్‌లో కుర్దీష్‌ గ్రూపులతో మాస్టర్ ప్లాన్

ఇరాన్ అంతర్గత రాజకీయాలను దెబ్బతీసేందుకు అమెరికా నిఘా సంస్థ (సీఐఏ) ఒక భారీ “మాస్టర్ ప్లాన్” సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్‌లోని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా, అక్కడి కుర్దీష్ వేర్పాటువాద గ్రూపులతో కలిసి సీఐఏ ఈ వ్యూహాన్ని రచిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దాడుల్లో మరణించారనే వార్తలు వచ్చినప్పటికీ, ఇరాన్ తన దూకుడును తగ్గించకుండా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి ఇరాన్ లోపల అంతర్యుద్ధాన్ని ప్రేరేపించాలని అమెరికా భావిస్తోంది.

ఈ వ్యూహంలో భాగంగా, ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఐదు ప్రధాన కుర్దిష్ పార్టీలు ఏకమై “కోయలిషన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ ఆఫ్ ఇరానియన్ కుర్దిస్తాన్” అనే బలమైన కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమికి సీఐఏ అత్యాధునిక ఆయుధాలను , సైనిక శిక్షణను అందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాక్-ఇరాన్ సరిహద్దుల్లోని రహస్య ప్రాంతాలలో అమెరికా సైనిక సలహాదారులు కుర్దిష్ ఫైటర్లకు శిక్షణ ఇస్తున్నారని సమాచారం. ఇరాన్ సైన్యంను సరిహద్దుల వద్దే నిలువరించి, దేశం లోపల ఉన్న సాధారణ ప్రజలు నిరసనల్లో స్వేచ్ఛగా పాల్గొనేలా చేసి, ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చేలా చేయడం ఈ ప్లాన్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఇరానియన్ కుర్దిస్తాన్ డెమోక్రటిక్ పార్టీ ఛైర్మన్ ముస్తఫా హిజ్రీతో చర్చలు జరపడం ఈ పరిణామాలకు బలాన్ని చేకూరుస్తోంది. పశ్చిమ ఇరాన్‌లో త్వరలోనే పెద్ద ఎత్తున భూతల ఆపరేషన్ ప్రారంభం కానుందని, దీనికి అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు ఉంటుందని కుర్దిష్ వర్గాలు ఆశిస్తున్నాయి. దీనికి ప్రతిచర్యగా, ఇరాన్ సైన్యం ఇప్పటికే సరిహద్దుల్లోని కుర్దిష్ స్థావరాలపై విరుచుకుపడుతోంది . విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో వందలాది మంది కుర్దిష్ కార్యకర్తలను అరెస్టు చేస్తోంది. ఇరాన్, ఇరాక్, టర్కీ, సిరియా దేశాల్లో విస్తరించి ఉన్న కుర్దీష్ సమూహాలకు అమెరికాతో దశాబ్దాల అనుబంధం ఉంది. ఆ బంధాన్ని ఉపయోగించుకుని ఇరాన్‌లో అంతర్యుద్ధం సృష్టించడం ద్వారా, అక్కడి ప్రస్తుత వ్యవస్థను పూర్తిగా మార్చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాలు గల్ఫ్ రీజియన్‌లో పెను మార్పులకు దారితీసేలా కనిపిస్తున్నాయి.