Breaking NewsHome Page SliderHoroscope TodayNational

మావోయిస్ట్ అగ్రనేత గణేష్ హతం

ఒడిశా అడవుల్లో భద్రతా దళాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కార్యకలాపాల బాధ్యుడు ఉయికే గణేష్ (69) గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. కంధమాల్ – గంజాం జిల్లాల సరిహద్దులోని రాంపా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో గణేష్‌తో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళా క్యాడర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మావోయిస్టు అగ్రనేతల కదలికలపై అందిన పక్కా సమాచారంతో ఒడిశా ప్రత్యేక విభాగం ఎస్‌ఓజీ , సీఆర్‌పీఎఫ్ మరియు బీఎస్‌ఎఫ్ బలగాలు సంయుక్తంగా రాంపా అడవులను జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ తర్వాత ఘటనా స్థలంలో గణేష్ మృతదేహంతో పాటు భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గణేష్ తలపై వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం ₹5 కోట్ల రివార్డు ఉంది.మరణించిన ఉయికే గణేష్ అసలు పేరు గణేష్. ఆయన తెలంగాణలోని నల్గొండ జిల్లా పులిమెల గ్రామానికి చెందినవారు. బీఎస్సీ పూర్తి చేసిన గణేష్, సుమారు 40 ఏళ్ల క్రితం అడవి బాట పట్టారు. చదువుకున్న వ్యక్తి కావడంతో పార్టీలో వేగంగా ఎదిగిన ఆయన, దండకారణ్యం ,ఒడిశా ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భద్రతా బలగాలపై జరిగిన పలు భారీ దాడులకు ఈయనే సూత్రధారిగా భావిస్తున్నారు.
అమిత్ షా ఈ కీలక పరిణామంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఒడిశాలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని భద్రతా బలగాలు సమర్థవంతంగా తుడిచిపెట్టాయని కొనియాడారు. ఒడిశా ఇప్పుడు మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని ఆయన ప్రకటించారు. 2026 మార్చి 31 నాటికి దేశం మొత్తం మావోయిస్టు రహితంగా మారుతుందన్న తమ లక్ష్యానికి ఈ విజయం ఒక పెద్ద ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.