రాజీనామా చెయ్యడానికి సిద్ధమే అంటున్న మణిపూర్ సీఎం
మణిపూర్‌లో గత కొన్ని నెలల క్రితం రెండు తెగల మధ్య ప్రారంభమైన గొడవ ఆ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా ఈ గొడవల్లో హింస తారాస్థాయికి చేరింది. దీంతో అక్కడ భయానక వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన మహిళల ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భరతమాతను అవమానించే విధంగా మణిపూర్ హింసవాదులు ఓ మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటన భారతదేశానికే సిగ్గు చేటుగా ఉంది. దీంతో మణిపూర్ అంశాలతో పార్లమెంటు ఉభయసభలు కూడా నిరసనలతో దద్దరిల్లుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ స్పందించి కీలక ప్రకటన చేశారు. బీజేపీ పార్టీ పెద్దల నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని ఆయన తెలిపారు. కాగా వారి ఆదేశాల ప్రకారం రాజీనామా చెయ్యడానికి కూడా తాను సిద్ధమన్నారు. మణిపూర్‌లో శాంతిభద్రతలను కాపాడటం నా బాధ్యత అని సీఎం బీరెన్ సింగ్ ప్రకటించారు. దీంతో ప్రకటన కాస్త ప్రస్తుతం రాజకీయాలలో ప్రాధాన్యం సంతరించుకొంది.

