లోకేష్‌కు కానుకగా మంగళగిరి, చంద్రబాబుకు చేనేతల హామీ
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేనేతల ఆడపడుచు పంచుమర్తి అనురాధకు అఖండ విజయం చేకూర్చిన తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని… ఉండవల్లిలోని ఆయన నివాసంలో చేనేత పద్మశాలి సంఘాల నేతలు, పంచుమర్తి అనురాధతో కలిసి వెళ్లి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ చేనేతల పక్షపాతి అని, అఖండ చేనేత జనావళికి అద్భుత కానుకగా అనురాధ విజయాన్ని అందించారని అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు అన్నారు. చంద్రబాబును కలిసి తప్పనిసరిగా మీ రుణం తీర్చుకుంటాం సార్ అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా లోకేష్‌ని అఖండ విజయంతో గెలిపించి, బహుమతిగా అందజేస్తామని తెలియజేశారు. అంతకుముందు మంగళగిరి నుంచి ర్యాలీగా చంద్రబాబు నివాసానికి చేనేతలు వందలాదిగా చేరుకున్నారు.


