పెళ్లిపీటలెక్కిన ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ సుహానా
“మనసంతా నువ్వే” సినిమాలో “తూనీగా తూనీగా” అంటూ గౌను వేసుకుని తూనీగలా పరిగెత్తే చిన్నపాప అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలనటిగా ప్రేక్షకులను మెప్పించిన నటి సుహాని కలిత వివాహం వైభవంగా జరిగింది. అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ అయిన విభర్ హసీజాతో కలిసి సుహాని ఏడడుగులు వేసింది. ఈ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయామంటూ కామెంట్లు చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన పెళ్లికుమారుడు విభర్ ‘యువర్స్ ఈవెంట్ ఫుల్లీ’ అనే కంపెనీ సీఈవోగా ఉన్నారు.

‘మనసంతా నువ్వే’ చిత్రంలో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో అలరించిన సుహాని ఇంకా ‘బాల రామాయణం’, ‘గణేశ్’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ఎలాచెప్పను’ వంటి చిత్రాల్లో బాలనటిగా నటించింది. ‘స్నేహగీతం’ అనే సినిమాలో హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొందింది.

