ఈడీ దాడులపై మమత పిటిషన్ కొట్టివేత
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ సర్వే సంస్థ ఐ–ప్యాక్ కార్యాలయం, డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ జరిపిన శోధనలపై తృణమూల్ కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ నెల 8న జరిగిన ఈడీ దాడుల్లో రాజకీయంగా గోప్యమైన డేటాను స్వాధీనం చేసుకున్నారన్న అనుమానంతో టీఎంసీ ఈ పిటిషన్ దాఖలు చేసింది.
తృణమూల్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ , ఆరు సంవత్సరాలుగా సేకరించిన రాజకీయ డేటా ఈడీ చేతుల్లోకి వెళ్లి ఉండొచ్చన్న భయంతోనే పిటిషన్ వేశామని తెలిపారు. మరోవైపు , శోధనల్లో ఎలాంటి రికార్డులు, పత్రాలు లేదా డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకోలేదని, డేటా బ్యాకప్ కూడా తీసుకోలేదని ఈడీ తరఫు న్యాయవాదులు పేర్కొంటున్నారు. అయితే , ఈడీ చేసిన ఈ ప్రకటనను హైకోర్టు రికార్డు చేసింది. శోధనల సమయంలో ఈడీ తయారు చేసిన పంచనామాలను పరిశీలించిన తర్వాత ,ఏ వస్తువూ స్వాధీనం కాలేదని ధృవీకరించింది. దీంతో “ఈ పిటిషన్‌లో విచారించాల్సిందేమీ లేదు” అంటూ కేసును కొట్టివేసింది.
ఇదే వ్యవహారంపై ఈడీ సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ ప్రసాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించనుంది.

