NationalNews

గుజరాత్ టు అసోం… కొనసాగుతోన్న మహా డ్రామా

Share with

మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గుజరాత్ సూరత్ నుంచి వ్యవహారం అసోం గౌహతికి మారింది. నిన్న సాయంత్రం వరకు ఎక్ నాథ్ షిండే గ్రూపులో 21 మంది ఎమ్మెల్యేలు ఉండగా… ఆ టీమ్ కు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జతయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే రాజకీయాలపై గుస్సాగా ఉన్న మంత్రి ఎక్‌నాథ్ షిండే… కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటికే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కలయికకు కటీఫ్ చెప్పి.. బీజేపీతో కలిసి ప్రయాణించాలంటున్న ఎక్‌నాథ్ తాజాగా మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహా సీఎం ఉద్ధవ్ థాక్రేతో టెలిఫోన్ సంభాషణల తర్వాత ఆయన గౌహతికి వెళ్లడం అసాధారణంగా మారింది. ఎక్ నాథ్ తో కీలక అంశాలపై చర్చించానన్న ఉద్ధవ్ థాక్రే… ముందుగా ఎమ్మెల్యేలు ముంబైకి రావాలన్నారు. క్లిష్ట సమయంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతిస్తున్నాయని చెప్పారు. బీజేపీతో కలిసి పనిచేయాలని షిండే చెబుతున్నారని.. అయితే అది సాధ్యం కాకపోవడం వల్లే ప్రత్యామ్నాయబాట పట్టామని పార్టీ నేతలకు వివరించారు థాక్రే. మరోవైపు శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఇప్పటికే ప్రకటించారు.