అయ్యప్ప పాటతో పేరడీ.. మండిపడ్డ భక్తులు
కేరళలోని శబరిమలలో వివాదాలు రాజుకుంటున్నాయి. ఇటీవల స్థానిక ఎన్నికల సందర్భంగా అయ్యప్ప భక్తి గీతం వైరల్‌గా మారింది. అయితే ఈ భక్తి గీతాన్ని పేరడీగా మార్చి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యంగ్యంగా రూపొందించారు. నిత్యం దేవాలయాల్లో మారుమ్రోగే ప్రసిద్ధ అయ్యప్ప భక్తి గీతం ‘పొట్టియే కెట్టియే’ పాట ఆధారంగా పేరడీ పాట రూపొందించడంతో భక్తులు మండిపడుతున్నారు. పాట శబరిమల ఆలయంలో జరిగిన బంగారు దోపిడీ గురించి వ్యగ్యంగా రూపొందించారు. దీంతో మత విశ్వాసాలను అవమానించడం, జనాలను ఘర్షణకు ప్రేరేపించడం వంటి ఆరోపణలపై కేరళ పోలీసులు బుధవారం ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ పాట వీడియోను చిత్రీకరించిన కంపెనీపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. నిందితులు అయ్యప్ప భక్తి గీతం శరణ మంత్రాన్ని అవమానించారని, పైగా ఈ వ్యంగ్య గీతాన్ని సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయడాన్ని నేరంగా ఎత్తి చూపుతూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నిందితుల లిస్టులో ఖతార్‌కు చెందిన రచయిత జిపి కున్‌హబ్దుల్లా చలప్పురం, సింగర్ డానిష్ ముహమ్మద్, వీడియోను చిత్రీకరించిన సీఎంసీ మీడియా, నిర్మత సుబైర్ పంతులూర్‌లను నిందితులుగా పేర్లు చేర్చారు. వీరిపై BNS సెక్షన్లు 299 మతపరమైన భావాలను రెచ్చగొట్టడం, సమూహాలను ఘర్షణకు ప్రేరేపించడం కింద కేసు నమోదు చేశారు. ఇక వివాదం చెలరేగిన అయ్యప్ప పేరడీ సాంగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు దుయ్యబట్టాయి. సీపీఐ(ఎం) పేరడీకి భయపడుతుందని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

