మళ్లీ మొదలైన లోన్‌యాప్ ఆగడాలు
గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో లోన్‌యాప్ ఆగడాలు పెట్రేగిపోయాయి. వీరి వేధింపులు భరించలేక ఎంతోమంది ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై జోక్యం చేసుకుని,లోన్‌యాప్ వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకున్నాయి. ఈ చర్యలతో లోన్‌యాప్ నిర్వాహకులు కొంచెం వెనక్కి తగ్గారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఈ లోన్‌యాప్ వేధింపుల కేసులు వెలుగులోకి రాలేదు. తాజాగా ఈ లోన్‌యాప్ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. వీటి కారణంగా ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. కాగా యువతి EMI కట్టినా లోన్‌యాప్ సిబ్బంది వేధించినట్లు తెలుస్తోంది. అది ఎంతలా అంటే యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి కుటుంబసభ్యులకు పంపారు. దీంతో అవమానం భరించలేని యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిపై యువతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా..పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోపక్క ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతూ..వీటిని అరికట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ తరహ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

