అధికారం కోసమే లోకేష్ పాదయాత్ర
◆ కుప్పంలో చంద్రబాబు… మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయం
◆ టీడీపీని గెలిపించేందుకే పవన్ కళ్యాణ్ రాజకీయాలు
◆ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
అధికారమే లక్ష్యంగా నారా లోకేష్ పాదయాత్ర నిర్వహించతలపెట్టాడని, రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నగర పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. నిజమైన పాదయాత్రకు అర్థం తీసుకొచ్చింది దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయ షర్మిలమ్మ, తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు మాత్రమేనన్నారు. రాష్ట్రంలో వారు చేపట్టిన పాదయాత్రల ద్వారా ఎన్నో ప్రజా సమస్యలకు పరిష్కారం లభించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మ్యానిఫేస్టోలో ప్రకటించిన సమస్యలను నూటికి నూరుశాతం పరిష్కరించి ప్రజలకు అండగా నిలబడిన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని, ఆయన పరిపాలనలో నేడు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారని, రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.

రాష్ట్రంలో ఏమి సమస్యలు ఉన్నాయని నారా లోకేష్ పాదయాత్ర చేపట్టాలనుకున్నారో ప్రజలకే అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు మంగళగిరి నియోజకవర్గంలో అక్రమంగా నివసిస్తూ… నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో కూడా పర్యటించలేదని విమర్శించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకోలేక పోబట్టే లోకేష్ ఓటమి చెందారన్నారు. ఇప్పటికైనా లోకేష్ ముందు ఆలోచన చేసుకుని నియోజకవర్గంలో పొరపాట్లు, లోపాలను ఎత్తి చూపిస్తూ నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. అంతేగానీ ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందన్న చందాన రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ చేపట్టే పాదయాత్రను ప్రజలు ఎంతమాత్రం హర్షించరన్నారు. ఇక గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా సిఫార్సులు చేసిన వారికే పెన్షన్లు మంజూరు చేసే వారిని… అదీ ఎవరైతే చనిపోయారో వారి స్థానాన్ని భర్తీ చేసి పెన్షన్ ఇచ్చేవారన్నారు.

నేడు వైసీపీ హయాంలో రాజకీయాల్లేవని, రికమండేషన్లు, లంచాలు, కులాలు, మతాలు ప్రస్తావన లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.2,750/- పెన్షన్ మంజూరు చేస్తున్నామని, సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే రూ.3వేల చొప్పున పెన్షన్ కూడా అందజేస్తారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారని, ఈ విషయం ప్రజలు కూడా చెబుతున్నారన్నారు. సినిమా హీరోగా పవన్ సక్సెస్ అవ్వొచ్చేమోగానీ రాజకీయాలకు పనికిరాననే విషయం ఆయనకు కూడా తెలుసునన్నారు. జనసేన పార్టీ అధికారంలో వస్తుందని, నేను ముఖ్యమంత్రిని అవుతానని పవన్ కళ్యాణ్ ధైర్యంగా చెప్పకపోవడం బాధాకరమన్నారు.

