ఏక్ భారత్-శ్రేష్ట భారత్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: ముర్ము
ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో ముందుకెళ్దామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆమె ఆదివారం ప్రసంగించారు. ఎన్నో వైవిధ్యాలతో కూడిన మన దేశ ప్రజలందరినీ దేశభక్తి అనే ఒక ఉమ్మడి అంశం ఒక్కటిగా కలిపి ఉంచుతోందని చెప్పారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొని ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలిచిందన్నారు. వ్యాక్సిన్ లను తయారు చేసి ప్రపంచ దేశాలకు అందించడంతో పాటు మన దేశంలోనూ 200 కోట్ల వ్యాక్సిన్ల రికార్డును పూర్తి చేసి మార్గదర్శిగా నిలిచిందన్నారు. యువభారత్ డిజిటలైజేషన్లోనూ ముందుందన్నారు.
అంతేకాదు.. మహిళా సాధికారితలోను, లింగ అసమానతలు తగ్గించడంలోనూ మన దేశ ప్రజలు ఆదర్శవంతమైన పాత్రను పోషిస్తున్నారన్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో మన యువశక్తి పై ప్రపంచమంతా ఆధార పడటం మనకు గర్వకారణమని చెప్పారు. సామాజిక రాజకీయ రంగాల్లోనూ మహిళలు ముందంజ వేస్తున్నారని కొనియాడారు. పైలట్ల నుంచి శాస్త్రవేత్తల వరకు ఎక్కడ చూసినా మహిళా భాగస్వామ్యం పెరిగిందని ప్రశంసించారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం మరింత కష్టపడాలని సూచించారు.