మునుగోడు బరిలో కోదండరాం..!
మునుగోడులో ఉప ఎన్నికల హీట్ పెరిగే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే బరిలో నిలుస్తాయని భావించిన ప్రజలకు ఇతర పార్టీలు సైతం మేమున్నామంటూ ముందుకొచ్చాయి. ప్రజాశాంతి పార్టీ తరఫున ప్రజా యుద్ధనౌక గద్దర్ పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. ఇప్పుడు కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి(టీజేఎస్) కూడా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతోంది.

రెండు, మూడు రోజుల్లో అభ్యర్థి..
మునుగోడులో పోటీ చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం శుక్రవారం చెప్పారు. అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ అంటూ దేశ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని కోదండరాం విమర్శించారు. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని.. తెలంగాణాలో వాస్తవ సమస్యలను ఢిల్లీ పెద్దలకు తామూ వివరిస్తామన్నారు.

గద్దర్‌కు మద్దతు..?
నిజానికి మునుగోడులో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఆ పార్టీ నేతలు కోదండరాంను కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న కోదండరాం ఏకంగా అభ్యర్థిని నిలబెడతాననడంతో కాంగ్రెస్ నేతలు షాక్‌కు గురయ్యారు. మరోవైపు.. గద్దర్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే తెలంగాణ సమాజం ఆయన వెంట ఉంటుందని కోదండరాం చెప్పారు. దీంతో కోదండరాం టీజేఎస్ అభ్యర్థిని ప్రత్యేకంగా ప్రకటిస్తారా.. గద్దర్‌కే మద్దతిస్తారా.. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.