చేనేత రంగంపై మోదీ ప్రభుత్వానికి చిన్నచూపు- కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కి KTR లేఖ
టెక్స్ టైల్స్ పై GST తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు తెలంగాణా మంత్రి కేటీఆర్ లేఖ రాసారు. దేశంలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న అతిపెద్దరంగమైన టెక్స్ టైల్స్ ను మోదీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని,చేనేత రంగంపై కక్ష కట్టిందని విమర్శించారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కుకు కేంద్రం సహాయం చేయట్లేదని, సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు ఏమై పోయిందని నిలదీసారు. కేంద్రమంత్రులు అబద్దాలు మాని, తెలంగాణా నేతన్నలకు సహాయం చేయాలన్నారు. చేనేతపై జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు నయాపైసా కూడా సహాయం చేయట్లేదని, నోటి మాటలు కట్టిపెట్టి నిధులమూటలు ఇవ్వాలని, ప్రకటనలు కాదు పథకాలు కావాలని తెలంగాణా టెక్స్ టైల్స్, చేనేత రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలని డిమాండ్ చేసారు.
హైదరాబాద్ నగరంలో నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తో పాటు హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం నుంచి స్పందన లేదని, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యండ్ లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయలేదని,పవర్ లూం మగ్గాల అప్ గ్రేడేషన్ కు కేంద్రం నిధులు ఇస్తామని ఇవ్వలేదని మండిపడ్డారు. 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయాలని, చేనేత పైన జిఎస్టీ రద్దు చేయాలి, టెక్స్ టైల్స్ పైన జియస్టీ తగ్గించాలి అని విజ్ఞప్తి చేసారు. కేంద్ర టెక్స్ టైల్ శాఖకు మంత్రులు మారుతున్నారే కాని తెలంగాణ విజ్ఞప్తులకు మాత్రం సానుకూల స్పందన రావడం లేదని, ఈ అంశాలన్నింటిపై టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో సైతం నిలదీస్తామనీ కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.