ఈటల, కేటీఆర్ కలిసి ఏం మాట్లాడుకున్నారు..!?
ఒకరు తెలంగాణ నెంబర్ 2 కేటీఆర్. మరొకరు బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్.. గతంలో ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పుడు సన్నహితంగా ఉండేవారన్న చెప్తుంటారు. కానీ ఇప్పుడు వారిద్దరూ ప్రత్యర్థి పార్టీలో ముఖ్యనేతలు. ఒకరు బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తేవాలని ప్రయత్నిస్తుంటే.. మరొకరు బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు అగ్రనేతలకు తెలంగాణ అసెంబ్లీ వేదికయ్యింది. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ముందు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. హుజూరాబాద్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్ ప్రశ్నించారట. అయితే సమావేశానికి పిలిస్తే కదా వచ్చేదని ఈటల బదులిచ్చారట. ఈ సందర్భంగా ఈటల, కేటీఆర్‌కు పలు సూచనలు చేశారట. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం సరిగా లేదన్నారట.. ఇద్దరు నేతలు మాట్లాడుకుంటున్న సమయంలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అక్కడకు వచ్చి… తనను కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదని కంప్లైంట్ చేశారట. కనీసం కలెక్టరన్నా ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవాలి కదా అని ఈ సందర్భంగా ఈటల అన్నారట. అందుకు బదులివ్వాల్సిన మంత్రి కేటీఆర్ మాత్రం నవ్వి ఊరుకున్నారట. ఇక కేటీఆర్ కంటే ముందు ఈటల రాజేందర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.


