సీఎం క్లౌడ్ బరస్ట్ కామెంట్స్‌పై కొండా లాజికల్ కౌంటర్
తెలంగాణలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా దీనిపై ఒకప్పటి టీఆర్ఎస్ మాజీ ఎంపీ, ఇటీవల బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందంటూ సీఎం కేసీఆర్ ఆధారాలు లేకుండా మాట్లాడారని ఒకవేళ ఫ్రూఫ్లు ఉంటే ముఖ్యమంత్రి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అంటున్నట్లుగా అసలు క్లౌడ్ బరస్ట్ ఎ దేశం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు
.
రాకెట్లు లేదా విమానంతో క్లౌడ్ బరస్ట్ చేయాలంటే వాళ్ళకి ఇండియాలో ఒక సీక్రెట్ ఏర్ బేస్ కచ్చితంగా ఉండాలని వివరించారు. బహుశా ఆ ఎయిర్ బేస్ కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లోనే ఉండి ఉంటుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వరదలు వచ్చినా ఇబ్బందులు తలెత్తవని గతంలో చెప్పారని, మరి ఇప్పుడేమైందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆ ప్రాజెక్టు డిజైన్ చేసిన విధానం కరెక్ట్ కాదని తేలిపోయిందని, మూడేళ్లు కాకముందే కొండ పోచమ్మ లీకేజీ అవుతోందని విమర్శించారు. వరదల వల్ల నష్టపోయిన బాధితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలకు విలువ లేకుండా పోయిందన్నారు. గతంలో కేసీఆర్ జీహెచ్ఎంసీ వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని దుయ్యబట్టారు.