Home Page SliderNews

ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ అరెస్ట్

రాడికల్ సిక్కు బోధకుడు, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు నాటకీయంగా వెంబడించి అరెస్టు చేశారు. పోలీస్ ప్రత్యేక బృందం జలంధర్‌లోని షాకోట్ తహసీల్‌కు వెళుతుండగా వేర్పాటువాద నేత కాన్వాయ్‌ను వెంటాడింది. అమృతపాల్ సింగ్‌ అరెస్టు చేయాలని భావించిన పోలీసులు రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అమృత్‌సర్ జిల్లాలోని అమృత్‌పాల్ స్వగ్రామమైన జల్లుపూర్ ఖైరా వెలుపల ఆందోళనలు జరుగుతాయని ఊహించి పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.

అమృత పాల్ సింగ్‌ను జీ 20 సదస్సు అయ్యాక అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఐతే రోజు రోజుకు ఆయన ఆగడాలు మీతిమీరిపోతున్నాయని భావించిన ప్రభుత్వం ఇవాళ అరెస్టు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన నటుడు దీప్ సిద్ధూ ప్రారంభించిన “వారిస్ పంజాబ్ దే” రాడికల్ సంస్థకు అమృతపాల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఎలాగైనా అమృత పాల్‌ను అరెస్టు చేయాలని భావించిన పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి.. ప్రణాళిక రూపొందించుకున్నారు. కొన్నేళ్లుగా సాయుధ మద్దతుదారులతో కలిసి అమృత పాల్ రాష్ట్రమంతటా అలజడి సృష్టిస్తున్నాడు. సహాయకుడు, నిందితుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 23న భారీ నిరసనకు దిగాడు. మద్దతుదారులు కొందరు కత్తులు, తుపాకులు చూపుతూ అమృత్‌సర్ నగర శివార్లలోని అజ్నాలాలోని పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి అలజడి రేపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అమృతపాల్ సింగ్ అరెస్టు విషంలో కాంగ్రెస్ హాట్ కామెంట్స్ చేసింది. పంజాబ్ సర్కారు నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ రవ్‌నీత్ సింగ్ బిట్టు తీవ్ర విమర్శలు చేశాడు. ఖలిస్తాన్ కోసం ఆయుధాలు ఎత్తడం గురించి మాట్లాడే వ్యక్తి నేడు పోలీసులకు భయపడి పారిపోతున్నాడని దుయ్యబట్టారు. సిక్కులు ఎప్పుడైనా పారిపోయారా? ధైర్యం ఉంటే పోలీసులను ఎదుర్కొనేవాడన్నాడు. నక్కలా వీధుల్లో తిరగడని ధ్వజమెత్తాడు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆప్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయన్నారు.