మునుగోడులోనే కేసీఆర్ మకాం..!
ఉప ఎన్నికలో వారం రోజుల ప్రచారానికి ప్లాన్
బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయం
మునుగోడుకు వందలాది కార్లతో భారీ ర్యాలీ
మునుగోడులోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి
మునుగోడు, మనసర్కార్: మునుగోడులో ఇక తాడోపేడో తేల్చుకుందామని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ‘నేను స్వయంగా దిగుతా.. ఏం జరుగుతుందో చూద్దాం’ అని సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన కేసీఆర్ గురు లేదా శుక్రవారం మునుగోడు వెళ్లాలని భావిస్తున్నారు. వారం రోజులు అక్కడే మకాం వేసి.. ఉప ఎన్నికల సందర్భంగా చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ బస కోసం భవనాలను పరిశీలించేందుకు సీఎంవో అధికారులు మునుగోడు, చండూరు, చౌటుప్పల్‌లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వందలాది కార్లతో భారీ కాన్వాయ్‌గా మునుగోడుకు వెళ్లి టీఆర్‌ఎస్ బలాన్ని నిరూపించుకోవాలని కేసీఆర్ వ్యూహం రూపొందిస్తున్నారు.

బీఆర్‌ఎస్ కోసం విజయం తప్పనిసరి..
ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అక్రమాలకు పాల్పడుతుందని టీఆర్‌ఎస్ నేతలు భయపడుతున్నారు. అందుకే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. అవసరమైతే మునుగోడు ప్రచారం గడువు ముగిసే వరకూ అక్కడే ఉండాలని.. పలు గ్రామాల్లో ఓటర్లతో నేరుగా మాట్లాడాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. తాను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కాలంటే మునుగోడు విజయం తప్పనిసరి అని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు.

వందలాది కార్లతో బండి సంజయ్ రోడ్ షో..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం నుంచి మునుగోడు ప్రచారంలోకి దిగారు. 100కు పైగా కార్లతో రోడ్ షో నిర్వహిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. అయితే.. బండి సంజయ్ రోడ్ షోలో స్థానికులు తక్కువ.. బయటి ప్రజలు ఎక్కువగా ఉన్నారని టీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. వందలాది కార్లలో బయటి వాళ్లను తరలించడం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని.. బీజేపీ ఇలా చేస్తున్నా ఎన్నికల సంఘం ఏం చేస్తోందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మునుగోడులోనే మకాం వేసి ఊరూరా ప్రచారం నిర్వహిస్తున్నారు.

టీఆర్‌ఎస్, బీజేపీ పోటాపోటీ ప్రచారం..
టీఆర్‌ఎస్‌కు చెందిన 14 మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇప్పటికే తమకు కేటాయించిన గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ కూడా భారీ బలగాన్ని దించి గల్లీ గల్లీ ప్రచారాన్ని తీవ్రం చేసింది. విద్వేష ప్రసంగాలతో జనాలను బండి సంజయ్ రెచ్చగొడుతున్నారని.. ప్రచారం నిర్వహించకుండా ఆయనపై నిషేధం విధించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. ఇక ఉద్ధండుల ప్రచార హోరుతో తమ చెవులు గిల్లుమంటాయని మునుగోడు ప్రజలు భయపడుతున్నారు.

