కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా వేట తప్పదు-ఈటల
తెలంగాణ సీఎం కేసీఆర్ సంగతి తేల్చేదాక వదిలేది లేదన్నారు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ పై ఎన్నికల బరిలో దిగుతానని ఈటల స్పష్టం చేశారు. 9 నెలలుగా హుజూరాబాద్ లో ఏ శంకుస్థాపన చేసినా… శిలాఫలకంపై తన పేరు వేయడం లేదని… గతంలో తాను తెచ్చిన నిధులను… పేరు మార్చి కొత్త శిలాఫలకాలు వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా హక్కులకు, ప్రొటోకాల్ కు భంగం కలిగించలేదని… తెలంగాణ వచ్చాక ఇలాంటి పరిస్థితి దాపురించిందన్నారు. కేసీఆర్ పై గజ్వేల్ లో పోటీ చేస్తానని ప్రకటించానని… ఇప్పుడు హూజూరాబాద్ నుంచి ఐనా పోటీకి సిద్ధమన్నారు. కేసీఆర్ పై ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి తీరతానన్నారు. పోటీపై ఆప్షన్ కేసీఆర్ కే వదిలేస్తున్నానన్న ఈటల… ఇందిర, ఎన్టీఆర్ లాంటి వాళ్లే ప్రజాగ్రహంలో కొట్టుకుపోయారన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వదలి బీజేపీలోకి వస్తారని భావిస్తున్నానన్నారు ఈటల. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజయ్య యాదవ్ లాంటి నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. త్వరలో ఊహకందని మార్పులు రాబోతున్నాయన్నారు. పలు పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు టచ్ లో ఉన్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక.. హుజూరాబాద్ లో వందేళ్లకు సరిపడ అభివృద్ధి చేసి చూపిస్తానన్న ఈటల… టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడన్నారు.