Andhra PradeshNews

చంద్రబాబు.. మేకపోతు గాంభీర్యం !

Share with

◆అధికారం తమదేనంటూ జబ్బలు చరచడంపై పలు విమర్శలు
◆ చాలా మంది నేతల్లో సన్నగిల్లిన నమ్మకం
◆ కంటి తుడుపు చర్యగా పార్టీ కార్యక్రమాలు
◆ ఉచిత పథకాలు పొందినవారు జగన్‎కు ఓటు వేస్తే అంచనాలు తారుమారు

తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అంతా అయోమయం అంతా గందరగోళంగా ఉంది పరిస్ధితి. అధికారంలోకి రాబోయేది మళ్ళీ టిడిపినే అని పదే పదే చంద్రబాబునాయుడు చెబుతున్నా చాలామంది అభ్యర్ధులు, నేతల్లో ఏమాత్రం నమ్మకం కలగటం లేదు. కొన్ని జిల్లాలో టీడీపీ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరు చందంగా తయారయ్యారు. ఏ నియోజకవర్గంలోనూ పార్టీ కేడర్‌ పటిష్టంగా లేకపోవడంతో కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. నాయకులు అప్పుడప్పుడూ చేపడుతున్న పార్టీ కార్యక్రమాల్లో కంటితుడుపు చర్యగా పాల్గొని మిన్నకుండిపోతున్నారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో నేతలు తలమునకలవగా కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంపై కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారం తమదేనంటూ జబ్బలు చరచడంపై కూడా పలు విమర్శలు గుప్పిస్తున్నారు.

అనుకున్న దానికన్నా ఒంగోలులో నిర్వహించిన తెలుగుదేశం మహానాడు సక్సెస్ అయిన మళ్లీ అధికారంలోకి వస్తామా అనే విశ్వాసం చంద్రబాబు నాయుడుకు సన్నగిల్లిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైయస్ జగన్ పై గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమం పై ప్రజలనుంచి కొంతమేర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కచ్చితంగా ఈసారి జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని భావించిన చంద్రబాబు ఇప్పుడు సందేహంలో పడ్డారని, ప్రభుత్వంపై ఎక్కువ వ్యతిరేకత అనుకున్న స్థాయిలో లేదేమో అని ఉచిత పథకాలు పొందిన వారు జగన్ కు ఓటు వేస్తే అంచనాలు కచ్చితంగా తారుమారవుతాయని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ తెలుగుదేశం పార్టీలో విశ్వాసం స్థిరంగా నిలవడం లేదు నిజంగానే జగన్ ను గద్దె దించే సామర్థ్యం తమ పార్టీకి ఉందా లేదా అని పార్టీ క్యాడర్లో అనుమానం కలుగుతుంది.

మరోపక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జగన్ కు అన్ని విధాల సహకరించడంతో ఆ పార్టీ నేతలు అయోమయంలో ఉన్నారు. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబీకుతుందన్న ప్రచారం నిజమా, అతిశయోక్తా అన్నది వారికి అర్థం కావడం లేదు. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఎందుకు వారు చాలా గుంభనంగా ఉన్నారు, ప్రజల నాడి సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాము లేదంటే దానికి అనుగుణంగా మంచి వ్యూహాలు రచించుకోవచ్చన్న ఆలోచనలలో టిడిపి పెద్దలు ఉన్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ కూడా బలంగా పనిచేయనుండటంతో మరల ప్రతిపక్షంలోనే కూర్చోవాలి ఏమో అన్న మీమాంసలో టిడిపి నాయకులు కనపడుతున్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే సమర శంఖం పూరించిన వైఎస్ జగన్ అధికారాన్ని దక్కించుకుంటారా? లేదా తెలుగుదేశం పార్టీ పెద్దలు వ్యూహాలకు పదును పెట్టి సక్సెస్ అవుతారా అనేది వేచి చూడాల్సి ఉంది.