కేసీఆర్‌కు మూడింది
సీఎం కేసీఆర్‌కు తెలంగాణాలో మూడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని, అందుకే బీజేపీ ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్ గూండాలతో తగులబెట్టిస్తున్నారని విమర్శించారు. పోలీసు అనుమతితో, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్న తనను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తన పాదయాత్రను అడ్డుకుంటున్న టీఆర్‌ఎస్ గూండాలను అరెస్టు చేసి జైల్లో వేయకుండా తనను అరెస్టు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల అవినీతి సొమ్ముతో కేసీఆర్ విర్ర వీగుతున్నారని, లిక్కర్ స్కాంలో ఆయన బిడ్డ (కవిత)కు ప్రమేయం ఉందని స్పష్టం చేశారు. ఈ స్కాం బయటకు రాకూడదనే ఆయన తన అరెస్టు స్కెచ్ వేశారన్నారు.

`నీ కుటుంబం నిజాయితీగా ఉంటే.. నీ కూతురును తక్షణం సస్పెండ్ చేయాలి. చట్ట ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలి. నీ కూతురుకో న్యాయం.. ఇతరులకో న్యాయమా?` అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదన్నారు. పాదయాత్రను ఎక్కడ అడ్డుకున్నారో అక్కడి నుంచే మళ్లీ ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. మూడో విడత పాదయాత్ర ముగింపు బహిరంగ సభను నిర్వహించి తీరుతామని, ఆ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్ తెలిపారు.